భారతీయ (తెలుగు) విద్యార్థులకు అనుమతి నిరాకరణ పై మరికొన్ని వివరాలు
నిన్న చెప్పినట్టుగా … ఒక్క రోజు లోనే 21 మంది తెలుగు విద్యార్థులకు అమెరికా ఎయిర్ పోర్ట్ లలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతి నిరాకరించి, వెనక్కి పంపేసిన వార్తా పై మరి కొంత సమాచారం తెలిసింది.
ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గానే ఇచ్చామని, అయినా అనుమతి లభించలేదు అని, దాదాపు 4-5 గంటల విచారణ తరువాత, 5-6 గంటలు ఒక రూమ్ లో ఇంకొక విద్యార్థిని తో కలిపి ఉంచారని, ఆ తరువాత మేము వచ్చిన డెల్టా ఎయిర్ లైన్స్ లో ఢిల్లీ కి తిరిగి వచ్చామని ఒక విద్యార్థిని తెలిపింది. అట్లాంటా ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ అధికారులు తన ఫోన్ కూడా తీసుకొని పరిశీలించారని, అందులో వున్నా విషయాలపై తనను ప్రశ్నించారని తెలిపింది.
అట్లాంటా లో వున్న భారతీయ అధికారులను (కాన్సల్ జెనరల్ అఫ్ ఇండియా) సంప్రదిస్తామని కోరితే.. ఇప్పుడు కాన్సల్ జనరల్ ఆఫీస్ మూసివేసి ఉంటుందని మా అభ్యర్థన ను త్రోసిపుచ్చారని తెలిపింది. అదే సమయం లో ఇండియా లో వున్న మా తల్లి తండ్రులతో మాట్లాడి ఈ విషయం వారికీ చెపుతాము అన్న అభ్యర్థన కూడా నిరాకరించారు అని తెలిపింది.
ఈ విషయం పై శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత దేశ కాన్సల్ జనరల్ డా. టీవీ నాగేంద్ర ప్రసాద్ గారిని ఫోన్ లో కాంటాక్ట్ చేయగా శాన్ ఫ్రాన్సిస్కో ఆఫీస్ కి ఈ విషయం పై ఎటువంటి వార్త రాలేదు అని చెప్పారు. కేవలం ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఏ భారతీయ వ్యక్తినైనా అనుమాన పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తే తప్ప ఆఫిషియల్ గా మా ఆఫీస్ ని సంప్రదించరని కూడా తెలిపారు.
ఈ విధంగా అట్లాంటా ఎయిర్ పోర్ట్ నుంచి వెనక్కి ఢిల్లీ చేరిన విద్యార్థులు మరల ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఇండియన్ ఇమ్మిగ్రేషన్ వారి దగ్గర కూడా కొత్త సమస్య ను ఎదుర్కొన్నారని కూడా తెలిసింది. అట్లాంటా లో అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ కారణం చేత వెనక్కి పంపుతున్నారో తెలియచేస్తూ ఒక డాక్యుమెంట్ ఇవ్వాలని, అవి ఇవ్వక పోవటం వలన ఇండియా లో అధికారులు కూడా అనేక ప్రశ్నలు వేసి, వారిని ప్రస్తుతం వెయిటింగ్ లో పెట్టారని తెలిసింది.
ఈ విషయాలు అన్ని తెలుసుకొని, సమగ్రహం గా అర్ధం చేసుకొని రావాలని ఇక ముందు వచ్చే విద్యార్థులకు మా విజ్ఞప్తి.













