అట్లాంటాలో ఘనంగా టీటీఏ బోర్డు మీటింగ్.. మెగా కన్వెన్షన్ లక్ష్యంగా వ్యూహరచన
TTA: అమెరికాలో తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా జూలైలో నిర్వహించనున్న టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 విజయవంతమే ధ్యేయంగా అట్లాంటాలో బోర్డు సమావేశం జరిగింది. అట్లాంటాలోని హిల్టన్ అల్ఫారెట్టా వేదికగా ఏప్రిల్ 18, 2026న తెలంగాణ అమెరికా తెలుగు సంఘం బోర్డు మీటింగ్ అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించారు. సంస్థ కార్యవర్గ కమిటీ, అడ్వైజరీ కౌన్సిల్, రీజనల్ లీడర్షిప్ సభ్యులు సుమారు 150 మందికిపైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, రాబోయే భారీ కార్యక్రమాలపై చర్చించడమే ప్రధాన లక్ష్యంగా ఈ మీటింగ్ సాగింది.
సుదీర్ఘ చర్చ..
టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాబోయే జులై 17 నుండి 19 వరకు నార్త్ కరోలినాలోని ఛార్లెట్‌లో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్ – 2026 గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ కన్వెన్షన్‌ను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై బోర్డు సభ్యులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది మాట్లాడుతూ.. గతంలో విజయవంతంగా నిర్వహించిన ‘సేవా డేస్’ (Seva Days) విశేషాలను గుర్తుచేయడంతో పాటు, కన్వెన్షన్ కోసం చేపట్టిన నిధుల సేకరణ (Fundraising) గురించి వివరించారు. డల్లాస్, న్యూయార్క్, న్యూజెర్సీ, ఛార్లెట్ వంటి నగరాల్లో ఈ నిధుల సేకరణ కార్యక్రమాలు అద్భుత ప్రతిస్పందనతో ఘనంగా జరిగాయని ఆయన పేర్కొన్నారు.
ఐక్యతతో భవిష్యత్తు ప్రణాళికలు..
టీటీఏ ఫౌండర్ డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, కో-చైర్ డాక్టర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల మార్గదర్శకత్వంలో ఈ సమావేశం సాగింది. అమెరికాలోని తెలుగు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి సంస్థ తరపున అందించాల్సిన సేవలు, భవిష్యత్తులో చేపట్టబోయే సామాజిక కార్యక్రమాలపై వ్యూహరచన చేశారు. టీటీఏ తన దేశవ్యాప్త ఉనికిని మరింత పటిష్టం చేసుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోందని ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








