అమెరికాలో చదువులకు ‘ఆటా’ సాయం
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చే విద్యార్థులకు సాయం చేసేందుకు అమెరికా తెలుగు అసోసియేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలితో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం వల్ల తెలంగాణ రాష్ట్రం నుంచి అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు సెమినార్స్ నిర్వహిస్తారని, కాలేజీల ఎంపిక, స్కాలర్ షిప్పులు, ఉద్యోగ అవకాశాలు వంటి వివరాలు అందిస్తారని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
విద్యార్థుల కోసం ప్రత్యేక గైడ్స్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్టు అమెరికా తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి చెప్పారు. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వచ్చే విద్యార్థుల్లో 30 శాతం మనవాళ్లు ఉండేవారని, ఇటీవల ఆ సంఖ్య తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షులు అసిరెడ్డి కరుణాకర్, ప్రతినిధులు శ్రీధర్ తిరుపతి, భువనేశ్వర్ బుజాల, వినోద్ కోడూరుతోపాటు మండలి వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.













