వీణ కళాకారులకు అండగా ‘తానా’
ఉత్తర అమెరికా తెలుగు సంఘం సేవా కార్యక్రమాల్లో భాగంగా కళాకారులను, కళలను ప్రోత్సహిస్తూ వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. దుస్థితిలో ఉన్న వీణ కళాకారులను ఆదుకునేందుకు తానా ముందుకు వచ్చింది. వీణ కళాకారులకోసం ఆన్లైన్లో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని తానా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి ప్రముఖ వీణ విద్వాన్ సుధాకర్ రాయప్రోలు, బెంగళూరు నుంచి శోభా మొక్కపాటి పాల్గొని త్యాగరాజు, అన్నమయ్య కీర్తనలను తమ వీణ ద్వారా అందించారు. నూజివీడుకు చెందిన వీణ కళాకారుడు మాబు షేక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వీణ తయారి పరిశ్రమని నెలకొల్పి ఎన్నో వేల వీణలను తయారు చేస్తూ మరెన్నో వీణలకు మరమ్మతులు చేస్తున్నారు. తన శ్రమని, పరిశ్రమని నలుగురికి తెలియజేయటానికి, వెనకపడి ఉన్న పరిశ్రమకి కాస్త చేయూతనివ్వటానికి తానా అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వీణ తయారీ ఇతర వివరాలను తెలియజేశారు. తను వీణ తయారిని తండ్రి నుంచి ఎలా నేర్చుకున్నది, పలువురి ప్రముఖులకి వీణలను తయారు చేసి ఇచ్చిన విధానాన్ని, వేరే వారికి ఈ విద్యను నేర్పించాలన్న తన కలని అందరితో పంచుకున్నారు. తనతోనే తన కళ అంతరించిపోకూడదని, పరిశ్రమ నెలకొల్పటానికి పలువురు సహాయం చేయాలని మాబు షేక్ విన్నవించారు.
తానా జాయింట్ ట్రెజరర్ వెంకట్ కోగంటి, రీజనల్ కోఆర్డినేటర్స్ రాజా కసుకుర్తి, సుమంత్ రాం, సతిష్ చుండ్రు అధ్వర్యంలొ విజయ నాదెళ్ల, సుధీర్ నారెపలుపు మరియు వెంకట్ సింగు సహాయ సహకారాలతో ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానా కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. తానా ఇలాంటి వాటికి సహాయం చేయటానికి ఎప్పుడూ ముందు ఉంటుందని తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు అన్నారు. తానా కార్యదర్శి రవి పొట్లూరి మాట్లాడుతూ వీణ తయారిదారుడు మాబు షేక్ కి తానా తరుపున లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కల్చరల్ సమన్వయకర్త సునిల్ పంత్రా కళను ప్రోత్సహించాల్సిన అవసరం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికి తానా జాయింట్ ట్రెజరర్ వెంకట్ కోగంటి ధన్యవాదాలు తెలియజేశారు.













