తానా 2021 మహాసభలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది – మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలు వచ్చే సంవత్సరం కూడా యధావిధిగా జరుగుతాయని, ఇప్పటివరకు తాము అనుకున్న షెడ్యూల్ ప్రకారమే కార్యక్రమాల నిర్వహణకు ముందుకెళుతున్నామని మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి పేర్కొన్నారు. పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటరులో 2021 జులై 2,3,4 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన తానా 23వ ద్వైవార్షిక మహాసభలపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, శాస్త్రవేత్తల అవిరళ కృషితో విజయవంతంగా రూపొందే కరోనా టీకాతో పాటు, దైవబలం తోడుగా ఈ సభలు యథాతథంగా ప్రణాళికాబద్ధంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. టీకా ఆలస్యమైన పక్షంలో తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, తానా కార్యవర్గం తదుపరి నిర్ణయానికి అనుగుణంగా ఈ సభల నిర్వహణ ఉంటుందని రవి అన్నారు. సామాజిక దూరం, అతిథుల ఆరోగ్యం, పక్కాగా కరోనా నివారక చర్యలను దృష్టిలో ఉంచుకుని ఈ సభలను విజయవంతం చేసేందుకు తమ బృందం ప్రణాళికలు రూపొందిస్తోందని రవి పొట్లూరి వెల్లడించారు. కాగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తానా మహాసభల్లో పాల్గొనేందుకు ప్రముఖులతోపాటు ఎంతోమంది ఎదురుచూస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఈసారి తానా మహాసభలను పెన్సిల్వేనియా కన్వెన్షన్లో నిర్వహిస్తున్నారు.













