డొనాల్డ్ ట్రంప్ సిబ్బందికి గాయాలు
శ్వేతసౌధం నూతన ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రెషమ్పై ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ బాడీగార్డులు ప్రతాపం చూపించారు. ఉత్తర-దక్షిణ కొరియాల మధ్య ఉన్న నిస్సైనిక ప్రదేశంలో ఉత్తర కొరియా అధినేత కిమ్‌తో అమెరికా అధ్యక్షుడు కరచాలనం చేశారు. ఇదే సమయంలో కిమ్ దగ్గరగా వెళ్లేందుకు స్టెఫానీ, కొందరు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. దీంతో కిమ్ బాడీగార్డ్స్ బృందం వారిని పక్కకు నెట్టేసింది. ఈ క్రమంలో చిన్న తోపులాట చోటు చేసుకొంది. దీనిలో స్టెఫానీ స్వల్పంగా గాయపడినట్లు అమెరికా ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. మరోపక్క కిమ్- ట్రంప్ ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన మీటింగ్ హాల్లోని స్థానాల్లో కూర్చునేందుకు ఆమె కొందరు ఉత్తరకొరియా వాసులతో పెనుగులాడాల్సి వచ్చింది. ఈ క్రమంలో గాయపడ్డట్టు మరికొన్ని పత్రికల్లో వచ్చింది. దీనిపై స్టెఫానీ మాత్రం ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. వ్రతం చెడ్డా ఫలితం దక్కనట్టైంది అమె పరిస్థితి. చివరకు ట్రంప్-కిమ్‌లు ఆ భవనం బయట సమావేశం అయ్యారు.













