జెడితో నాట్స్ వెబినార్ విజయవంతం
కోవిడ్ 19 సంక్షోభ వేళలో నాట్స్ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ, మరోవైపు వెబినార్ల ద్వారా పరిస్థితులపై అవగాహనను పెంచుతోంది. కోవిడ్ 19 వైరస్ మానవాళిపై పంజా విసురుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో.. సమాజం ఎలా స్పందించాలి..? సామాజిక బాధ్యత ఎలా ఉండాలి..? అనే అంశంపై సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణతో నిర్వహించిన వెబినార్‌కు మంచి స్పందన లభించింది. వేలాదిమంది జూమ్, ఫేస్బుక్ ద్వారా అనుసంధానమై ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని ఈ వెబినార్‌కు వ్యాఖ్యాతగా వ్యవహారించారు. కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో సంక్షోభంలో కూడా అవకాశాలను చూడాలని లక్ష్మీనారాయణ సూచించారు.
కరోనా విషయంలో ప్రస్తుతం అమెరికాతో పోల్చుకుంటే భారత్ ఎంతో సురక్షితంగా ఉందని ఆయన అన్నారు. భారత్ ముందుస్తుగా లాక్డౌన్ అమలు చేయడంతో పాటు.. భారతీయ జీవన విధానమే భారతీయులకు రక్షణ కవచంలా మారిందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కరోనా కమ్ముకుంటున్న వేళ భారతీయ జీవన విధానం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని.. దీనిపై అమెరికాలో కూడా తెలుగువారు విస్తృతంగా ప్రచారం చేసి.. భారతదేశం గొప్పతనం చాటాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరులో.. రోగ నిరోధక శక్తి ఎంతో కీలకమని తెలిపారు. రోగ నిరోధకశక్తిని పెంచుకునే విషయంపై ప్రవాస భారతీయులు దృష్టి పెట్టాలని కోరారు. అలాగే భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖ సూచించిన ఆహారాన్ని తీసుకుని.. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.
అలాగే కరోనా మనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. వలస కూలీలకు ఉపాధి హామీ పని దినాలు పెంచడం.. స్థానిక ఉత్పత్తులకు పెద్ద పీట వేయడం.. ఇవన్నీ కూడా భారత్‌కు కొత్త అవకాశాలే అని ఆయన తెలిపారు. అమెరికాలో ఉండే ప్రవాసులు పల్లెల్లోని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపే సరికొత్త పరికరాలు, సాప్ట్వేర్లు కనిపెట్టాలని సూచించారు. అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని అడుగులు వేస్తే.. ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. తెలుగువారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం చేపడుతున్న సేవలు బాగున్నాయని లక్ష్మీనారాయణ ప్రశంసించారు. సామాజిక సేవలో ఉత్తమ ఫలితాలు విషయంలో లక్ష్మీనారాయణ ఈ వెబినార్ ద్వారా దిశానిర్దేశం చేశారు.






