అమెరిరాకాలో మళ్లీ సందడి మొదలైంది!
అమెరికాలో మళ్లీ సందడి మొదలైంది. దాదాపు 31 రాష్ట్రాల్లో తిరిగి కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆయా రాష్ట్రాల గవర్నర్లు లాక్డౌన్ నిబంధనలు దాదాపు పూర్తిగా సడలించారు. ఫ్లోరిడా, క్యాలిఫోర్నియా, న్యూయార్క్లలో రోడ్లన్నీ బిజీబిజీగా కనిపిస్తున్నాయి. కిక్కిరిసిన జన సమూహాలు బీచ్లు, రెస్టారెంట్లు, పార్క్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే లక్షా 20 వేల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడి, 68 వేల మందికి పైగా మృతి చెందినప్పటికీ, అమెరికా పౌరులు స్వేచ్ఛగా తిరిగేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రజల మూడ్ను గమనించిన ఆయా రాష్ట్రాల గవర్నర్లు లాక్డౌన్ నిబంధనలను సడలించారు.
గృహ నిర్బంధాలను వీడి జనం తమ కార్యకలాపాలను సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చిన్న చిన్న వ్యాపారాలు మొదలయ్యాయి. కార్యాలయాలకు మళ్లీ జనకళ వచ్చేసింది. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన, నగరం మియామీ మళ్లీ కేసీనోలతో సందడి చేస్తోంది. ఫ్లోరిడాలో అన్ని రెస్టారెంట్లలో 25 శాతం కెపాసిటీతో ప్రారంభించడానికి అనుమతించగా, పెద్దఎత్తున జనం ఎగబడుతున్నారు. క్యాలిఫోర్నియాలో అధికారికంగా ఇంకా సడలింపులు రాకపోయినప్పటికీ, జనం ఏ మాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు.






