GWTCS: ఘనంగా జిడబ్ల్యుటీసిఎస్ ఉగాది వేడుకలు
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది (Ugadi) వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాహిత్య, యుగళ గీతాలు, చిన్నారుల నృత్య ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏప్రిల్ 26, శనివారం మధ్యాహ్నం నాలుగు గంటల నుండి ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి 12 గంటల వరకూ సాగాయి. రక రకాల వేష ధారణతో, చిన్నారుల పలు నృత్య కార్యక్రమాలు అన్ని తరాల వారిని ఆకట్టుకున్నాయి. తదుపరి నిరావల్ బ్యాండ్ వారి ప్రత్యేక కార్యక్రమం యువతరాన్ని ఉర్రూతలూగించింది. వేడుకలకే హైలైట్‌గా నిలిచిన నిరావల్ బ్యాండ్ వారు పాడిన సూపర్ హిట్ పాటలు వచ్చినవారిని ఉర్రూతలూగించింది. పలువురు ఆనందంతో డ్యాన్స్‌లు వేశారు. హుషారెత్తించే పాటలతో, డ్యాన్సులతో వచ్చినవారికి ఈ వేడుకలు కనువిందు చేశాయి.
ఈ సందర్భంగా జిడబ్ల్యుటీసిఎస్ అధ్యక్షుడు రవి అడుసుమిల్లి మాట్లాడుతూ.. తెలుగు భాష వైభవం, కళా, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడంలో ముందుంటున్న జిడబ్ల్యుటీసిఎస్ స్థానిక కళాకారులను ప్రోత్సహించడంలో కూడా ముందుంటుందని చెప్పారు. ఈ వేడుకల్లో కూడా స్థానిక కళాకారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారని చెప్పారు. అమెరికాలో సైతం ప్రతి తెలుగింటి పండుగను జరుపుకుంటూ.. ప్రాముఖ్యతను చాటుతూ.. అన్ని తరాల వారిని అలరిస్తూ, తెలుగు భాషను సజీవంగా నిలబెడుతున్న వేదికలు, సంఘాలలో జిడబ్ల్యుటీసిఎస్ ముందువరుసలో ఉంది. గత సంవత్సరం స్వర్ణోత్సవాలను జరుపుకున్న ఈ సంస్థ, మరో స్వర్ణోత్సవ కాలం పాటు ఈ పరంపరను కొనసాగిస్తుందని ఆయన తెలియజేశారు. పలువురు ఈ సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించిన టీమ్‌ను, స్వర్ణోత్సవాలను వైభవంగా జరిపిన మాజీ అధ్యక్షుడు కృష్ణ లాంను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, త్రిలోక్ కంతేటి, కిశోరె దంగేటి, మన్నే సత్యనారాయణ, సుధా పాలడుగు, కృష్ణ లాంతోపాటు కార్యవర్గ సభ్యులు సుశాంత్ మన్నే, రాజేష్ కాసారనేని, యశస్వి బొద్దులూరి, భానుప్రకాష్ మాగులూరి, చంద్ర మాలావతు, గంగ శ్రీనివాస్, విజయ్ అట్లూరి, యువ సిద్ధార్ధ్ బోయపాటి, ప్రవీణ్ కొండక, ఉమాకాంత్, పద్మజ, శ్రీవిద్య, పావని తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు వచ్చినవారికి ఉగాది పండుగ ఘన సంప్రదాయాన్ని చాటి చెప్పే పలు రకాల తెలుగింటి వంటకాలతో పసందైన విందును అందించారు.








