కమ్యూనిటీ కోసం ఆటా కొత్త కార్యక్రమాలు
అమెరికాలో ఉన్న కమ్యూనిటీకోసం మరిన్ని కొత్త కార్యక్రమాలు చేపట్టాలని అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్ణయించింది. నార్త్ కరోలినాలోని ర్యాలీలో జరిగిన ఆటా బోర్డ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని తెలుగు వారికీ ఆటా స్టూడెంట్ స్కాలర్ షిప్స్ మరియు మ్యాట్రీమోనియాల్ సర్వీసెస్ ప్రారంభించనున్నట్లు ఈ బోర్డ్ సమావేశంలో ఆటా ప్రకటించింది. ఎన్నో సేవా కార్యక్రమాల ప్రణాళికతో రూపు దిద్దుకున్న ఈ మీటింగుకి చాల ప్రాధాన్యత ఏర్పడింది. ఈ బోర్డు మీటింగ్‌కు ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి అధ్యక్షత వహించారు. 1990 నుండి పెద్ద సంఖ్యలో అమెరికా వలస వచ్చిన తెలుగు వారి అవసరాలకి అనుగుణంగా, ఆటా సేవా కార్యక్రమాలను రూపొందించి ఈ మీటింగ్‌లో పెట్టినట్లు వెల్లడించారు. ఈ సేవ కార్యక్రమాలలో భాగంగా, తెలుగువారికోసం మాట్రిమెనియాల్ సైట్‌ను ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి ప్రారంభించారు. అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులకోసం స్కాలర్షిప్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా అమెరికాలో చదువుకుంటున్న 10 మంది తెలుగు వారి పిల్లలకి, కాలేజీకోసం ఒక్కొక్కరికి 1000 డాలర్లను స్కాలర్షిప్ కింద ఇవ్వనున్నారు.
ప్రతి రెండు సంవత్సరాలకి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో, ఆటా వేడుకలు నిర్వహించటం ఆనవాయితీ. ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి, భువనేశ్ బుజాల (ప్రెసిడెంట్ ఎలెక్ట్)ను ఆటా వేడుకల చైర్ గా నియమించారు. ఈకమిటీ ఆటా డేస్ సందర్భంగా సేవ మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 2020లో జరగబోయే ఆటా సదస్సుకి రెండు నగరాలను బోర్డు పరిశీలించింది. లాస్ ఏంజెల్స్ నగర ఆటా టీమ్ అక్కడి సదుపాయాలని బోర్డు వివరించింది. కాగా అట్లాంటా కొద్దీ రోజుల్లో అక్కడి వసతుల వివరాలు ఇస్తామని బోర్డు కి వివరించింది.
అమెరికా లోని తెలుగు వారికీ మరింతగా సేవ చేయాలంటే, ఆటాలో తెలుగువారి సభ్యత్వం మరింత ఎక్కువగా ఉండాలని, దాని కోసం అమెరికా లోని తెలుగువారిని ప్రోత్సహించి సభ్యత్వం చేయించాలని బోర్డు అభిప్రాయపడింది.
ఈ బోర్డు మీటింగ్‌కి అమెరికాలోని వివిధ నగరాల నుండి రీజినల్ కో ఆర్డినేటర్స్, రీజినల్డైరెక్టర్స్, రీజినల్ అడ్వైజర్స్, ఉమెన్స్ కమిటీ చైర్స్, కో చైర్స్ మరియు స్టాండింగ్ కమిటీ చైర్స్, కో చైర్స్ మరియు ఆటా సభ్యులు దాదాపు 150 మంది వరకు హాజరు అయ్యారు. ఈ మీటింగ్‌కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసిన బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మధు బొమ్మినేని, సాయి సుదిని, స్టాండింగ్ కమిటీ చైర్స్ పవన్ నోముల, వెంకట్ ఏటుకూరి, రీజినల్ కో ఆర్డినేటర్స్ అజయ్ మద్ది, నిహారిక తదితరులకు బోర్డు ధన్యవాదములు తెలిపింది.













