న్యూజెర్సీలో ఆటా ప్రచార కార్యక్రమం విజయవంతం
అమెరికా తెలుగు సంఘం బాల్టిమోర్ లో జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు నిర్వహించనున్న 19వ ఆటా మహాసభలు, యూత్ కాన్ఫరెన్స్ కోసం వివిధ నగరాల్లో ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగా శనివారం, ఏప్రిల్ 18న న్యూజెర్సీలోని ‘రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస’లో నిర్వహించిన నిధుల సేకరణ, ప్రచార కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి సుమారు 250 మందికిపైగా ప్రవాస తెలుగు వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా 625,000 డాలర్ల భారీ నిధులు సేకరించినట్లు ఆటా కోశాధికారి శ్రీకాంత్ గుడిపాటి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా మాట్లాడుతూ ఆటా మహాసభల ప్రచార కార్యక్రమాలకు అన్నీ చోట్ల మంచి స్పందన కనిపించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇక్కడ నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి మీరంతా వచ్చి మద్దతు ఇవ్వడం మరింత ఉత్సాహం కలుగుతోందన్నారు. రాబోయే కాన్ఫరెన్స్‌లో చేపట్టబోయే వివిధ కార్యక్రమాలను ఆయన వచ్చినవారికి తెలియజేశారు. తెలుగు వారందరూ కలిసికట్టుగా వచ్చి ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆటా ట్రస్టీ విజయ్ కుందూరు, కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బనాలా మాట్లాడుతూ.. సభలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రేక్షకులకు వివరించి, అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ వేడుకలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తాయని ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల పేర్కొన్నారు.
ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పాటలు, డ్యాన్స్ మరియు బ్యూటీ పీజెంట్ పోటీల్లో యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత, ఇమ్మిగ్రేషన్ సమస్యలపై ఈ సారి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆటా మాజీ అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, బోర్డు సభ్యులు రాజు కకెర్ల, శ్రీని దర్గుల, రవీందర్ గూడూరు తదితరులు పాల్గొన్నారు. ఈవెంట్ విజయవంతం కావడంలో ప్రాంతీయ సమన్వయకర్తలు ప్రసాద్ ఆకుల, ప్రదీప్ కట్టా, కృష్ణ మోహన్‌తోపాటు సంతోష్ రెడ్డి, శ్రీనివాస్ దర్గుల, విజయ్ కుందూరు, శ్రీకాంత్ గుడిపాటి, విలాస్ జంబుల, ఫైనాన్స్ చైర్ ప్రవీణ్ అలా విశేష కృషి చేశారు.






