మిల్‌పిటాస్‌లో ఎపి జన్మభూమి సమావేశం

మిల్‌పిటాస్‌లోని స్వాగత్ రెస్టారెంట్‌లో జన్మభూమి కార్యక్రమంపై జూన్ 3వ తేదీన జరిగిన కార్యక్రమానికి ఎపి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ రామాంజనేయులు, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిపై ఓ వీడియోను ప్రదర్శించారు. రామాంజనేయులు మాట్లాడుతూ, ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణాభివృద్ధిలో పాలుపంచుకునేందుకు ముందుకురావాలని కోరారు. తాము పుట్టి పెరిగిన ప్రాంతాల అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు జన్మభూమి కార్యక్రమం మంచి అవకాశమని చెప్పారు.
జయరామ్ కోమటి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను అన్నీరంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని, ఈ అభివృద్ధిలో ఎన్నారైలు కూడా ముందుకు వస్తే రాష్ట్రం త్వరితంగా అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశ్యంతో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఎన్నారైలు తమ తమ ఊరిబాగుకోసం ముందుకు వస్తే వారు ఇచ్చే విరాళాలతోపాటు ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా గ్రాంట్‌ను ఇచ్చి అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ఇప్పటికే జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తున్నామని, చాలామంది ఎన్నారైలు ఇప్పటికే చాలా పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ముందుకు వచ్చారని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి, శ్మశానవాటికల్లో మౌలికవసతుల కల్పనలో కూడా ఎన్నారైల భాగస్వామ్యాన్ని కోరుకున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇతర వివరాలు కావాల్సినవారు జన్మభూమి ప్రాంత కో ఆర్డినేటర్లను, లేదా మిల్‌పిటాస్‌లో ఉన్న జన్మభూమి కార్యాలయంలో సంప్రదించవచ్చని కోరారు.
ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు జన్మభూమి కార్యక్రమంలో తమవంతుగా పాలుపంచుకుంటామని హామి ఇచ్చారు. విజయ ఆసూరి, వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకర్ల, పైలా ప్రసాద్, కృష్ణ గంప, జోగినాయుడు పైల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.