తారకరత్న కోలుకుంటున్నారు.. బాలకృష్ణకు కృతజ్ఞతలు: ఎంపీ విజయసాయి
హాస్పిటల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను చూసేందుకు ఆయన సమీప బంధువు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బుధవారం బెంగళూరు చేరుకున్నారు. అల్లుడి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది. తారకరత్నకు గుండె పోటు వచ్చిన రోజు 45 నిమిషాలపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పైభాగం దెబ్బతిని సైడ్ ఎఫెక్ట్లు వచ్చాయి. ఇది నాలుగు రోజులుంటుంది. అయితే ఇప్పటికే 4 రోజులు గడిచిపోవడంతో మెదడువాపు తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది. తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అన్నారు.
అంతేకాకుండా.. తారకరత్నకు డాక్టర్లు అద్భుతంగా చికిత్స అందిస్తున్నారని, నందమూరి బాలకృష్ణ దగ్గరుండి అన్నీ తానై చూసుకుంటున్నారని, ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ఇదిలా ఉంటే తారకరత్నకు గుండె పోటు అని తెలిసిన దగ్గర్నుంచి నందమూరి బాలకృష్ణ ఆయన వెన్నంటే ఉన్న సంగతి తెలిసిందే. బెంగళూరుకు తరలించాక కూడా బాలయ్య అక్కడే ఉన్నారు. తారకరత్న కోసం బాలయ్య పడుతున్న తపన నందమూరి అభిమానులతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా కదిలించింది. అందుకు విజయసారి రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం.













