డ్రగ్స్ కు దూరంగా ఉండమని రామ్ మెసేజ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) యూత్ కు కీలక సందేశం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ ఈగల్ ఫోర్స్‌కు తన మద్దతు ప్రకటిస్తూ డ్రగ్స్‌పై అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రగ్స్‌ను స్టైల్‌గా లేదా ట్రెండ్‌గా భావించొద్దని, అవి జీవితాలను నాశనం చేస్తాయని రామ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక్కటే ఈ సమస్యను అరికట్టలేదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే సమాజాన్ని డ్రగ్స్ బారిన పడకుండా కాపాడగలమని పేర్కొన్నారు. యూత్ తమ ఫ్యూచర్ లో విలువను గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా విదేశానికి చెందిన ఓ డ్రగ్ అడిక్ట్ చెప్పిన అనుభవాన్ని రామ్ షేర్ చేసుకున్నారు. కొద్దిసేపటి ఆనందం కోసం మొదలైన అలవాటు చివరికి జీవితాంతం భయంతో బతికే పరిస్థితికి తీసుకెళ్లిందని ఆ వ్యక్తి చెప్పిన మాటలు తనను తీవ్రంగా కలిచివేశాయని వెల్లడించారు. ఆ అనుభవం విన్న తర్వాత డ్రగ్స్ ఎంత ప్రమాదకరమో మరింత స్పష్టంగా అర్థమైందన్నారు. అందుకే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, జీవితాన్ని ప్రేమించాలని యూత్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే YOLO అనే పదానికి కొత్త అర్థాన్ని ఇస్తూ, డ్రగ్స్ ఆఫర్ చేసే స్నేహితులకు You Only Live Once అని చెప్పి వాటిని తిరస్కరించాలని రామ్ సూచించారు. తన కెరీర్లో వచ్చిన జగడం సినిమాను గుర్తు చేస్తూ, ఒకసారి డ్రగ్స్ అనే దుష్టచక్రంలో చిక్కుకుంటే బయటపడటం చాలా కష్టమని హెచ్చరించారు. ప్రస్తుతం రామ్ తన 23వ సినిమా RAPO23తో బిజీగా ఉండగా, ఇలాంటి సామాజిక బాధ్యతతో కూడిన సందేశాన్ని ఇవ్వడం సినీ వర్గాలతో పాటు అభిమానుల ప్రశంసలను అందుకుంటున్నారు.








