భారత ఆర్థిక వృద్ధిపై వార్ ఎఫెక్ట్.. జీడీపీ అంచనాకు ‘ఫిచ్’ కోత
పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ మేఘాలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న ఘర్షణలు ప్రపంచ ఇంధన మార్కెట్లను తీవ్ర కుదుపునకు గురిచేస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపైనా తీవ్రంగా పడనుందని ప్రముఖ అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థ ‘ఫిచ్ రేటింగ్స్’ (Fitch Ratings) హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (FY27) గాను భారత జీడీపీ (India GDP) వృద్ధి రేటు అంచనాకు ఫిచ్ కోత విధించింది. గతంలో అంచనా వేసిన 6.7 శాతం వృద్ధి రేటును, తాజాగా 6.4 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
పెరగనున్న ద్రవ్యోల్బణం
అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో, 2026 సంవత్సరానికి బ్రెంట్ క్రూడ్ సగటు ధరల అంచనాను ఫిచ్ రేటింగ్స్ అమాంతం పెంచేసింది. బ్యారెల్ క్రూడ్ ధరను గతంలో 70 డాలర్లుగా అంచనా వేయగా, ఇప్పుడు ఏకంగా 87 డాలర్లకు సవరించింది. ఈ స్థాయిలో ఇంధన ధరలు ఎగబాకితే, అది దేశీయ (India GDP) రవాణా రంగాన్ని ప్రభావితం చేసి.. వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. పర్యవసానంగా ద్రవ్యోల్బణం పెరిగి, సామాన్య వినియోగదారుడి కొనుగోలు శక్తి తీవ్రంగా దెబ్బతింటుందని ఫిచ్ విశ్లేషించింది. ఈ ప్రతికూల కారణాల వల్ల రాబోయే సెప్టెంబర్, డిసెంబర్ త్రైమాసికాల్లో దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ధరల కట్టడికి వడ్డీ రేట్ల అస్త్రం!
భారతదేశంలో ద్రవ్యోల్బణం రాబోయే నెలల్లో క్రమంగా పెరిగి, ఈ ఏడాది చివరి నాటికి 5.3 శాతానికి చేరుకోవచ్చని ఫిచ్ తన నివేదికలో స్పష్టం చేసింది. అంతర్జాతీయ కారణాలకు తోడుగా.. దేశీయ వాతావరణ పరిస్థితులు కూడా ఆర్థిక వ్యవస్థకు (India GDP) సవాలుగా మారాయి. తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉండటం, పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న తీవ్ర వడగాల్పుల వల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గి, నిత్యావసరాల ధరలు మరింత పెరిగే రిస్క్ ఉందని నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ ఏడాది మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫిచ్ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఆర్బీఐ సైతం తన వృద్ధి (India GDP) అంచనాలను తగ్గించి, ద్రవ్యోల్బణ అంచనాలను పెంచిన తరుణంలో ఫిచ్ నివేదిక వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆర్థిక వ్యవస్థకు దేశీయ డిమాండ్ దన్ను
అయితే గ్లోబల్ టెన్షన్స్ ఎన్ని ఉన్నా.. భారత ఆర్థిక వ్యవస్థకు (India GDP) కొన్ని సానుకూల అంశాలు బలంగా నిలబడుతున్నాయని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవడంలో దేశీయ మార్కెట్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపింది. దేశంలో ఉన్న బలమైన వినియోగదారుల డిమాండ్, మౌలిక సదుపాయాలపై పెడుతున్న భారీ పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి ఊతమిస్తాయని పేర్కొంది. అంతేకాకుండా గ్లోబల్ మార్కెట్ల అనిశ్చితి వల్ల దిగుమతులు తగ్గడం అనేది వాణిజ్య లోటు భారాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థకు (India GDP) కొంత ఊరట లభించేలా చేస్తుందని ఫిచ్ స్పష్టం చేసింది.








