మెట్రో ఇక సర్కారీ సొంతం.. ఎల్ అండ్ టీతో కుదిరిన డీల్
Metro Rail: భాగ్యనగర మెట్రో రైలు ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ (L&T) సంస్థకు ఉన్న వంద శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. మెట్రో పగ్గాలను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులోకి రావడానికి మరో కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది.
జూన్ 30 నాటికి ముగించాలని..
మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న రుణాలను ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) ద్వారా రీషెడ్యూల్ చేయించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎల్ అండ్ టీకి చెల్లించాల్సిన ఈక్విటీ సొమ్మును ప్రభుత్వం అందజేస్తుంది. జూన్ 30 నాటికి ఈ ప్రక్రియను ముగించాలని అధికారులు భావిస్తున్నారు. అప్పటి వరకు ప్రస్తుత బోర్డు ఆధ్వర్యంలోనే రోజువారీ కార్యకలాపాలు కొనసాగుతాయి.
నిర్వహణ బాధ్యతల్లో మార్పు లేదు..
మెట్రో యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి మారినప్పటికీ, రైళ్ల నిర్వహణ (Operations) బాధ్యతలు మాత్రం ప్రస్తుతానికి ఫ్రాన్స్‌కు చెందిన ‘కియోలిస్’ సంస్థ వద్దే ఉంటాయి. 2027 నవంబర్ వరకు ఈ సంస్థే మెట్రో సేవలను పర్యవేక్షించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ‘ఎస్క్రా’ ఖాతాను తెరిచి, పాత రుణాల చెల్లింపులను ప్రభుత్వం చేపట్టనుంది.
మరిన్ని కీలక నిర్ణయాలు..
ప్రభుత్వం నియమించే కొత్త బోర్డు బాధ్యతలు చేపట్టాక మెట్రో నిర్వహణలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రుణాల రీషెడ్యూలింగ్ కోసం ప్రభుత్వం పూచీకత్తు (Guarantee) ఇవ్వడంతో పాటు, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ద్వారా నిధుల సమీకరణను వేగవంతం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి








