విధులకు రాకుండానే వేతనాలు.. సాఫ్ట్వేర్కే షాకిచ్చిన అక్రమార్కులు!
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్లలో పారిశుధ్య విభాగం అక్రమాలకు నిలయంగా మారింది. విధులకు హాజరుకాకుండానే కొందరు సిబ్బంది వేతనాలు పొందుతుండటం కలకలం రేపుతోంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అక్రమార్కులు సాంకేతికతను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నారు.
ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్..
గతంలో బయోమెట్రిక్ విధానంలో మైనం వేలిముద్రలతో మోసాలకు పాల్పడిన అక్రమార్కులు, ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్’ (FRS) లోనూ లొసుగులను వెతుక్కున్నారు. ప్రస్తుతం ఈ రెండు సర్కిళ్లలో 998 మంది కార్మికులు ఎఫ్ఆర్ఎస్ లో నమోదై ఉండగా, అందులో 89 మంది అస్సలు విధులకు రావడం లేదు. వీరంతా ఫోన్ల ద్వారా లేదా ఎస్ఎఫ్ఏల (SFA) సహకారంతో హాజరు వేయించుకుంటూ విధులకు హాజరు కావడం లేదు.
రూ. 50 వేల నుండి రూ. 2 లక్షల వసూలు..
మూసాపేట సర్కిల్లో కొత్తగా విధుల్లోకి చేరిన సుమారు 40 మంది కార్మికుల నుండి ఒక్కొక్కరి వద్ద రూ. 50 వేల నుండి రూ. 2 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కింది స్థాయి నుండి పైస్థాయి వరకు ఈ ముడుపులు అందుతున్నాయని, అందుకే పర్యవేక్షణ కరువైందని విమర్శలు వినిపిస్తున్నాయి. పనికి రాని వారు కేవలం హాజరు వేయించుకుని వెళ్ళిపోతుంటే, క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ పడకేస్తోంది.
తనిఖీలు ముమ్మరం..
ఈ అక్రమాలపై ఫిర్యాదులు అందుతున్నాయని కూకట్పల్లి సర్కిల్ డీసీ రమేష్, మూసాపేట సర్కిల్ పర్యవేక్షకుడు నిరంజన్ రావు తెలిపారు. పని చేయకుండా హాజరు వేయించుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీలు ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేశారు. విజిలెన్స్ విచారణ చేపడితే మరిన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి








