పాక్ యువకుల యాక్టింగ్.. భారతీయ ఖాతాల మళ్లింపు.. సైబర్ నేరగాళ్ల కొత్త దందా!
Cyber Crime:సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో అమాయకులను నిలువునా దోచుకుంటున్నారు. తాము ఎన్ఐఏ (NIA), సీబీఐ (CBI), కస్టమ్స్ , పోలీస్ అధికారులమని పరిచయం చేసుకుంటూ వీడియో కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. బాధితులకు మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ సరఫరాలో ప్రమేయం ఉందంటూ బెదిరించి, ‘డిజిటల్ అరెస్ట్’ చేస్తున్నామనే భయం కల్పించి సొమ్ము వసూలు చేస్తున్నారు. ఈ ముఠాలో పాకిస్థాన్ యువకులు, నటులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
కంబోడియా కేంద్రంగా కార్యకలాపాలు..
ఒకప్పుడు రాజస్థాన్‌లోని జామ్తారా సైబర్ నేరాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత ఈ నెట్వర్క్ ఢిల్లీ, హర్యానా, యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాలకు విస్తరించింది. ప్రస్తుతం చైనా మాయగాళ్లు ఆన్లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టింగ్, క్యాసినో , లోన్ యాప్‌ల ద్వారా సైబర్ నేరాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. వీరు కంబోడియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు.
నేరం జరిగే విధానం..
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఏజెంట్లను నియమించుకుని, వారి ద్వారా షెల్ కంపెనీలు , కరెంట్ ఖాతాలను ప్రారంభిస్తున్నారు. సేకరించిన సెల్ఫోన్లు , సిమ్ కార్డులను కంబోడియాకు చేరవేస్తున్నారు. భారతీయ అధికారులమని నమ్మించడానికి పాకిస్థాన్ యువకులు, నటులతో బాధితులకు కాల్స్ చేయిస్తున్నారు.
డబ్బు 4 నుంచి 10 ఇతర ఖాతాల్లోకి ..
సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును వెంటనే షెల్ కంపెనీల ఖాతాల నుంచి సుమారు 4 నుంచి 10 ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. హవాలా మార్గంలో భారత కరెన్సీని డాలర్లుగా మార్చడం లేదా క్రిప్టో, బిట్కాయిన్లుగా మార్చి థాయ్‌లాండ్‌కు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సంస్థలు విచారణకు వేగంగా సహకరించకపోవడంతో, పోలీసులు ప్రస్తుతం మ్యూల్ ఖాతాల ద్వారా నేరస్తులను పట్టుకునేందుకు దృష్టి సారించారు.
ఇవి కూడా చదవండి








