భయం అవసరం లేదు… కరోనాపై అప్రమత్తంగానే ఉన్నాం : కేసీఆర్
కరోనా విషయంలో ఓ కన్నేసి ఉంచామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేర్కొన్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా పెరుగుదల కనిపిస్తోందని తెలిపారు. అయినా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నామని పేర్కొన్నారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేసీఆర్ స్పందించారు. అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. కరోనా విషయంలో కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు సూచనలు అందుతూనే ఉన్నాయని, విద్యా సంస్థల్లో కరోనా వ్యాప్తిచెందకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఇక… రేషన్ కార్డుల సంఖ్య పెరిగిందని వివరించారు. 2014 కంటే ముందు 29 లక్షల కార్డులుండేవని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంఖ్య 39 లక్షలకు చేరుకుందని పేర్కొన్నారు. ఆనాడు 200 రూపాయల పెన్షన్ ఇస్తే, నేడు 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని గుర్తు చేశారు. గతంలో రేషన్ కార్డు మీద 20 కేజీలకే అన్న పరిమితిని విధించారని, తాము అధికారంలోకి రాగానే ఆ పరిమితిని ఎత్తేసి, ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ ఇస్తున్నామని సీఎం తెలిపారు.
గంధమల్ల, మల్లన్న సాగర్ నిర్వాసితులకు మంచి పరిహారం ఇస్తున్నామని, పట్టణాల్లో ఇచ్చే రేటును పల్లె ప్రజలకు ఇవ్వరని స్పష్టం చేశారు. చట్టాలను అనుసరించి, నిబంధనలకు లోబడే నష్టపరిహారం ఇస్తున్నామని, ఎవ్వరికీ నష్టం జరగనివ్వమని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని రైతులకు వందకు వంద శాతం రుణమాఫీ చేసి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. 25 వేల వరకూ ఎంత మందికి రుణాలుండేవో వాటిని గత సంవత్సరం మాఫీ చేశామని, మిగితా వారి విషయంలో బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీశ్ ప్రకటన చేస్తారని తెలిపారు. పోడు భూముల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, 60 ఏళ్లలో జరిగిన అవకతవకల్ని పరిశీలించి, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్కు, తమ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో నీటి తిరువాను వసూలు చేసేవారని, తాము నీటి తిరువాను ఎత్తేశామని గుర్తు చేవారు. వైఎస్ కూడా ఉచిత కరెంట్ అని ప్రకటించారని, కానీ లాభం లేకుండా పోయిందని, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిందని సీఎం వివరించారు.
మంథని అడ్వకేట్ దంపతుల హత్యకు, టీఆర్ఎస్కు సంబంధం లేదు : సీఎం కేసీఆర్
మంథనిలో జరిగిన అడ్వకేట్ల హత్య కేసుతో టీఆర్ఎస్కు ఎలాంటి సంబంధమూ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అడ్వకేట్ దంపతుల హత్య దురదృష్టకరమని, ఆ హత్యను ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. ఈ హత్య కేసులో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నాడన్న విషయం బయటికి రాగానే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సందర్భంలోనూ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయలేదని, ఎన్నికల సమయంలోనూ డీజీపీకి ఫోన్ చేయలేదన్నారు. ప్రజాక్షేత్రంలో నిబద్ధతగానే ఉంటున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.













