స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై బీఆర్ఎస్ సర్జికల్ స్ట్రైక్!
హైదరాబాద్ మేయర్ పీఠంపై పాగా వేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, ఎన్నికల ఫలితాలను తలకిందులు చేసే అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సవరణపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టింది. 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న పార్టీ, ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో అడుగులు వేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా, హైదరాబాద్ రాజకీయాలపై పట్టున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఈ ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్ పరిధిలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలతో కేటీఆర్ ఇవాళ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని కేవలం అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియగా చూడవద్దని, ఇది పార్టీ గెలుపోటములను నిర్ణయించే కీలక అస్త్రమని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో జుబ్లీహిల్స్ వంటి నియోజకవర్గాల్లో తలెత్తిన పరిణామాలను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా లేకపోతే జరిగే నష్టాన్ని ఆయన వివరించారు.
ప్రధానంగా ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా నమోదు చేయించే దొంగ ఓట్లు, డబుల్ ఓట్ల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ ఆదేశించారు. అనర్హుల ఓట్లను గుర్తించి, వాటిని జాబితా నుంచి తొలగించేలా ఎన్నికల అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. అదే సమయంలో, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, ముఖ్యంగా యువ ఓటర్ల నమోదులో కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస యాదవ్ ను పర్యవేక్షకుడిగా నియమించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే తలసాని తనదైన శైలిలో యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన అనేది ఆఫీసుల్లో కూర్చుంటే సాధ్యం కాదని, అది బూత్ స్థాయి నుంచి జరగాలని ఆయన స్పష్టం చేశారు.ప్రతి నియోజకవర్గంలో తక్షణమే బూత్ లెవల్ అసిస్టెంట్లను నియమించాలని సూచించారు. నియమితులైన అసిస్టెంట్లకు ఓటర్ల జాబితాలోని అక్రమాలను ఎలా గుర్తించాలి, ఫామ్-7, ఫామ్-6 వంటి వాటిపై పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి ఇంటికీ వెళ్లి, జాబితాలో ఉన్న పేర్లు ఆ ఇంట్లో ఉంటున్నారా లేదా అని సరిచూసుకోవాలని, మరణించిన వారు లేదా ఇల్లు మారిన వారి ఓట్లను తొలగించేలా చూడాలని తీర్మానించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగకుండా బూత్ స్థాయి నుంచే నిరంతరం నిఘా ఉంచాలని డిసైడ్ అయ్యారు.
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎన్నికల ఫలితాలపై పెను ప్రభావం చూపుతుంది. చిన్నపాటి ఓట్ల తేడాతో గెలుపోటములు మారుతున్న తరుణంలో, బీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తలసాని వంటి సీనియర్ నేత ఈ బాధ్యతలు చేపట్టడం వల్ల క్షేత్రస్థాయిలో క్యాడర్లో ఉత్సాహం పెరగడమే కాకుండా, ఓటరు నమోదు ప్రక్రియలో పారదర్శకత వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి








