కేంద్ర వ్యవసాయ బిల్లుకు వైసీపీ ఫుల్ సపోర్ట్…
రైతు ఉత్పాదనల విక్రయ, వాణిజ్యానికి సంబంధించిన బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు రాజ్యసభలో జరిగిన చర్చలో శ్రీ వి.విజయసాయి రెడ్డి పాల్గొని తమ వైఖరి స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న మార్కెట్ విధానం వలన రైతులు తమ ఉత్పాదనలకు న్యాయమైన ధర కోసం దళారీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోందిని విజయసాయి రెడ్డి అన్నారు. మార్కెట్ లో ధరలు ఒడిదుడుకులకు గురైనప్పుడల్లా దళారులు రైతు కష్టార్జితాన్ని దోచుకోవడానికి చూస్తుంటారన్నారు. ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంటకు న్యాయమైన ధర చెల్లించకుండా లాభాల స్వీకరణకే మొగ్గు చూపుతున్న దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతు తమ ఉత్పాదనలకు ధరను తానే నిర్ణయించుకుని ఆ మేరకు వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఈ బిల్లు ద్వారా కలుగుతుందన్నారు.
ఏపీఎంసీ నియంతృత్వ విధానాలకు చెల్లు చీటీ.. కాంట్రాక్ట్ వ్యవసాయ విధానాన్ని అనుమతించడం ద్వారా మార్కెట్లో ధరల ఒడిదుడుకులతో నిమిత్తం లేకుండా ముందుగా నిర్ణయించిన ధరకే రైతు తన ఉత్పాదనలు అమ్ముకోగల సౌలభ్యాన్ని ఈ బిల్లు కల్పిస్తోందని చెప్పారు. లైసెన్స్ పొందిన ట్రేడర్లకు మాత్రమే తమ ఉత్పాదనలు విక్రయించాలనే నిబంధనను ఆసరాగా తీసుకుని ట్రేడర్లు కుమ్మకై రైతుల రైతుకు న్యాయమైన ధర దక్కకుండా చేస్తున్నారన్నారు. అయితే ఈ బిల్లుతో పరిస్థితిలో మార్పు వస్తుందని,మార్కెట్ వెలుపల రైతులు తమ పంటలను విక్రయించడానికి వ్యక్తులు లేదా కంపెనీలతో ముందుగానే ఒప్పందం చేసుకోవచ్చునని. ఏపీఎంసీ మార్కెట్ చట్టాలు కేవలం మార్కెట్కు మాత్రమే పరిమితం అవుతాయన్నారు. ఈ బిల్లుతో ఏపీఎంసీ నియంతృత్వ విధానానికి శాశ్వతంగా తెరపడుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. ఇక ఈ బిల్లులోని క్లాజ్ 2లో వ్యవసాయ ఉత్పాదనల కింద అన్ని రకాల ఆహార ధాన్యాలు, నూనె, పత్తి, పౌల్ట్రీ ఉత్పాదనలు చేర్చి పొగాకును ఎందుకు విస్మరించారని ఆయన ప్రశ్నించారు.
ఎగుమతులకు ఉద్దేశించే పొగాకును కూడా కాంట్రాక్ట్ సాగు పరిధిలోకి అనుమతించాలంటూ ఆయన వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్లో రైతు సంక్షేమ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా ఆయన సభలో ఉటంకించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఆర్ అనే అక్షరం రైతులోకానికి చిహ్నమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం కింద 49 లక్షల మంది రైతులకు ఏటా 13,500 రూపాయల ఆర్థిక సాయం అందుతోందని. దేశంలో రైతులకు ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు. పంటల ధరలలో ఏర్పడే హెచ్చు తగ్గుల వలన రైతాంగం నష్టపోకుండా 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధర హామీ ఇస్తోందని తెలిపారు.
కాంగ్రెస్ నయ వంచన…
ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నయవంచనకు పాల్పడుతోందని విజయసాయి రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే వ్యవసాయ మార్కెట్లను సంస్కరించి, కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని అమలులోకి తీసుకురావడం ద్వారా రైతాంగానికి మేలు చేస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు ఈ బిల్లు ద్వారా అదే పని చేస్తున్న ప్రభుత్వాన్ని తప్పుబట్టడం పూర్తిగా నయవంచనే అని ఆయన ఎద్దేవా చేశారు.













