CM Ramesh:డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఏపీ అభివృద్ధి : సీఎం రమేశ్

అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) , ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అదేతీరుతో వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) విమర్శించారు. అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీ (Medical College) ల పీపీపీ విధానంపై జగన్ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. గుజరాత్, యూపీ తదితర రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని పరిశీలించి ఆయన మాట్లాడితే బాగుంటుందన్నారు. జగన్ హయాంలోనే ఈ కాలేజీల టెండర్ల పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు వైద్య విద్యార్థులకు న్యాయం చేసేలా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) చూస్తుంటే, జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అసెంబ్లీకి వచ్చి సమస్యలపై మాట్లాడే దమ్ములేని నాయకుడు ఆయన. పరిశ్రలు పెట్టేవారిని బెదిరిస్తూ అనుచరులతో మెయిల్స్ చేయిస్తున్నారు. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కార్యదీక్షతో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీ అభివృద్ధి చెందుతుంటే ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారు అని విమర్శించారు.