Temple Donation Event: జాక్సన్విల్లేలో ‘తాజ’ ప్రభంజనం.. ఆలయ నిర్మాణం కోసం భారీగా విరాళాల సేకరణ!
TAJA: అమెరికాలోని జాక్సన్విల్లే ప్రాంత తెలుగు సంఘం (TAJA) మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. స్థానిక ఆలయ నిర్మాణానికి నిధులు సేకరించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టులో ‘తాజ’ బృందం అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు కమ్యూనిటీ భారీ స్థాయిలో నిధులను సేకరించి తమ దాతృత్వాన్ని చాటుకుంది.
మహిళా శక్తి , టీమ్ వర్క్:
ఈ విజయంపై ‘తాజ’ (2026-27) బృందం ప్రతినిధి సాయి విశ్వనాథ స్పందిస్తూ.. ఇది కేవలం టీమ్ కృషే కాకుండా, కమ్యూనిటీలోని మహిళలు చూపిన అంకితభావం , ఆపరేషన్స్ టీమ్ సమన్వయం వల్లే సాధ్యమైందని కొనియాడారు. సంఖ్యల కంటే కూడా పనిలో ఆనందాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగామని, ఫలితంగా మళ్ళీ తామే అగ్రస్థానంలో నిలిచామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

కమిటీకి అతీతంగా మద్దతు:
ముఖ్యంగా ‘తాజ’ కమిటీలో సభ్యులు కాకపోయినా, ఎంతో మంది తెలుగు వారు ఈ కార్యక్రమానికి వెన్నెముకగా నిలిచారని, వారి కుటుంబ సభ్యుల మద్దతు మరువలేనిదని సాయి పేర్కొన్నారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఇది తాము చేపట్టిన మొదటి భారీ కార్యక్రమమని, దీనిని ఘన విజయంతో ప్రారంభించడం తమలో మరింత ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఏడాది పొడవునా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.








