విశాఖలో ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్..!
విశాఖపట్నంలోని(Vizag) డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి(YSR) సెంట్రల్ పార్క్ (పాత సెంట్రల్ జైలు రోడ్డు) వద్ద సుమారు ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయ తలపెట్టిన ఫుడ్ కోర్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం, ప్రస్తుతానికి పనులన్నింటినీ నిలిపివేస్తూ స్టేటస్ కో (Status Quo) విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితమే ఈ ఫుడ్ కోర్టు నిర్మాణానికి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు.
అయితే, గ్రీనరీ మరియు బహిరంగ ప్రదేశాల కోసం ఉద్దేశించిన సెంట్రల్ పార్క్ స్థలంలో వాణిజ్య పరమైన ఫుడ్ కోర్టును నిర్మించడం నిబంధనలకు విరుద్ధమని జనసేన సీనియర్ నేత, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. పర్యావరణ నిబంధనలను పక్కనబెట్టి, పార్కును వాణిజ్య కేంద్రంగా మార్చడం వల్ల నగరంలోని ఊపిరితిత్తుల్లాంటి పార్కులు దెబ్బతింటాయని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలిచ్చింది.
ఇవి కూడా చదవండి
వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి తెరిచి, విచారణ జరిగే వరకు ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తమ వివరణ ఇవ్వాలని జీవీఎంసీ (GVMC), వీఎంఆర్డీఏ (VMRDA), జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామం ఇప్పుడు విశాఖ జనసేనలో అంతర్గత విభేదాలను రోడ్డుపైకి తెచ్చింది. ఒకవైపు జనసేన(Janasena) ఎమ్మెల్యే వంశీకృష్ణ ఈ ప్రాజెక్టును తన ప్రతిష్టాత్మక విజయంగా చెప్పుకుంటుండగా, అదే పార్టీకి చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కోర్టుకు వెళ్లి దాన్ని అడ్డుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని మూర్తి యాదవ్ వర్గం ఆరోపిస్తుంటే.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వంశీకృష్ణ మద్దతుదారులు విమర్శిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఉన్న నైట్ ఫుడ్ కోర్టును తొలగించి, పాత వెండర్లను కాదని కొత్త వారికి షాపులు కేటాయిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ స్టే రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి








