కడపలో ఉద్రిక్తత.. డీఎస్పీ వర్సెస్ బీజేపీ..!
కడప(Kadapa) నగరంలో హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) శోభాయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా వేడిని పుట్టిస్తున్నాయి. శాంతియుతంగా వేడుకలు నిర్వహిస్తున్న బీజేపీ(BJP) నాయకులపై అరాచక శక్తులు దాడులకు దిగడం, అదే సమయంలో పరిస్థితిని సర్దిచెప్పబోయిన బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై ఒక పోలీసు అధికారి చేయి చేసుకోవడంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై వెంటనే డీజీపీ స్పందించి సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కడప నగరంలోని అల్మాస్పేట సెంటర్లో బీజేపీ, ఎస్సీ మోర్చా నాయకులు తోరణాలు, జెండాలను ఏర్పాటు చేశారు. అయితే, కొంతమంది అరాచక శక్తులు వాటిని తొలగిస్తూ భౌతిక దాడులకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జ్ చేపట్టారు. సాధారణ ప్రజలపై లాఠీఛార్జ్ చేయవద్దని, దాడులకు దిగిన వారిని అడ్డుకోవాలని పోలీసులకు సర్దిచెబుతున్న క్రమంలో, జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై ఒక డీఎస్పీ స్థాయి అధికారి చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది.
ఈ ఘటనపై పి.వి.ఎన్. మాధవ్ ట్విట్టర్ (X) వేదికగా స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం వేగంగా జరుగుతున్నాయని, ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతున్న తరుణంలో ఇలాంటి అరాచక శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని మండిపడ్డారు. దాడులకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, సర్దిచెబుతున్న జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకోవడం అత్యంత గర్హనీయమని పేర్కొన్నారు. సదరు పోలీసు అధికారిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను, డీజీపీని ఆయన కోరారు. భక్తిశ్రద్ధలతో శోభాయాత్రలు నిర్వహిస్తున్న వారిపై కాకుండా, దాడులకు ఉసిగొల్పిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కడపలో జరిగిన ఈ భౌతిక దాడులను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.








