ఆకివీడు రామాలయంపై హైకోర్టు కీలక తీర్పు..!
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో(Akiveedu) రామాలయ నిర్మాణానికి సంబంధించి గత కొంతకాలంగా సాగుతున్న న్యాయపోరాటానికి ఏపీ హైకోర్టులో(Ap High Court) తెరపడింది. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలని, అధికారుల అనుమతులు చెల్లవని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం.. పిటిషనర్ వాదనలో పసలేదని తేల్చి చెప్పింది. అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం ఆ పిటిషన్ను కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఆకివీడులో రామాలయ నిర్మాణానికి అధికారులు ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి
అయితే, విచారణ సందర్భంగా రెవెన్యూ రికార్డులను పరిశీలించిన హైకోర్టు.. అక్కడ రామాలయం అనేది ఈరోజు వచ్చింది కాదని స్పష్టం చేసింది. దాదాపు 80 ఏళ్లుగా రెవెన్యూ రికార్డులలో సదరు స్థలంలో రామాలయం ఉన్నట్లు రికార్డై ఉందని ధర్మాసనం గుర్తించింది. ఎనిమిది దశాబ్దాల నాటి చారిత్రక రికార్డులను కాదని, ఇప్పుడు కొత్తగా అభ్యంతరాలు తెలపడం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చే ముందు రెవెన్యూ మరియు దేవాదాయ శాఖ అధికారులు అన్ని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారని హైకోర్టు పేర్కొంది.
“అధికారులు అన్ని ఆధారాలు చూశాకే అనుమతి ఇచ్చారు. రికార్డుల ప్రకారం అక్కడ ఆలయం ఉన్నప్పుడు, నిర్మాణాన్ని ఆపాలని కోరడం చట్టబద్ధం కాదు” అని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ లేవనెత్తిన సాంకేతిక అంశాల కంటే.. రికార్డులలో ఉన్న వాస్తవాలకే కోర్టు ప్రాధాన్యతనిచ్చింది. హైకోర్టు తీర్పుతో ఆకివీడు గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్ణయం సరైనదేనని కోర్టు ధ్రువీకరించడంతో, ఇక రామాలయ నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. అడ్డంకులు సృష్టించాలని చూసిన వారికి ఈ తీర్పు ఒక గుణపాఠమని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి








