టీడీపీలోనే పోటీ .. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వలేం : చంద్రబాబు
రాజ్యసభ స్థానాల కోసం టీడీపీలోనే పోటీ తీవ్రంగా ఉందని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వలేమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేసినట్లు తెలిసింది. మాధవ్, బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ (Madhukar) ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ (Rajya Sabha) స్థానాల్లో ఒకటి తమ పార్టీకి కేటాయించాలని మాధవ్ కోరగా, ఈసారి సాధ్యం కాదని సీఎం చెప్పినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి ఎక్కువ స్థానాలు కేటాయించాలని మాధవ్ కోరినట్లు తెలిసింది. గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల్ని ఎంపిక చేద్దామని, ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది ముఖ్యం కాదని సీఎం పేర్కొన్నట్టు సమాచారం.







