కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుంది : మంత్రి లోకేష్
గొడ్డలిపార్టీ ఫేక్ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి
మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది-సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సర్ ప్రక్రియ కారణంగా ఇంటింటికీ ప్రచారం కార్యక్రమం జులై 10కి వాయిదా
అవనిగడ్డ కార్యకర్తల సమావేశంలో టిడిపి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్
మోపిదేవి (అవనిగడ్డ): గొడ్డలి పార్టీ నేతలు, గత ప్రభుత్వంలో బూతు మంత్రులు కృష్ణా జిల్లా పరువు ఎలా తీశారో, ప్రస్తుతం విషప్రచారాలు ఎలా చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కేడర్‌పై ఉందని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కార్యకర్తలకు విజ్జప్తిచేశారు. మోపిదేవిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… మహనీయులు జన్మించిన ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో బూతుల మంత్రి ఉండేవారు, ఒకడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవాడు. మరొకడు భువనేశ్వరమ్మను అవమానించేవాడు. నేను ఆనాడే చెప్పా, వారి పేర్లు ఎర్రబుక్కులో రాస్తున్నా అని. వారి విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదు, రెడ్ బుక్ తన పని తాను చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉమ్మడి కృష్ణాజిల్లా, ఎన్టీఆర్ జన్మించిన నేల ఇది, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అవనిగడ్డలో ఆరుసార్లు టిడిపి, ఒకసారి కూటమి విజయం సాధించాయి. తెలుగుదేశం కార్యకర్తల రెక్కల కష్టంతోనే ఇది సాధ్యమైంది.
ఇవి కూడా చదవండి
పార్టీకోసం అహర్నిశలు కష్టపడి పనిచేయాలి
కడపలో గతఏడాది మహానాడులో ఐడియాలజీలో మార్పుకోసం ఆరుశాసనాలు తీసుకున్నాం. అందులో తొలి శాసనం కార్యకర్తే అధినేత. మొన్న ఆవిర్భావ దినోత్సవం రోజున జాతీయ అధ్యక్షుడి పక్కన టిడిపి సాధారణ కార్యకర్తలు కూర్చున్నారు. మార్పు మనవద్ద నుంచే మొదలు కావాలి. మనం ఎవరం శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ శాశ్వతం. వ్యవస్థను బలోపేతం చేసేందుకు అందరం అహర్నిశలు కష్టపడాలి. తోటచంద్రయ్యను గత ప్రభుత్వంలో ప్రత్యర్థులు వారి నాయకుడికి జైకొట్టమని మెడపై కత్తిపెడితే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలారు. గొడ్డలిపార్టీ అడ్డంకులు సృష్టించినా చట్టాన్ని సవరించాం. తోట చంద్రయ్య కుమారుడికి శాశ్వత ఉద్యోగం ఇచ్చాం. ఒక అంజిరెడ్డి తాత, మంజుల గారు, విజయవాడలో చెన్నుపాటి గాంధీ, అనేక ప్రత్యర్థులతో అనేక అవమానాలు, వేధింపులు ఎదుర్కొన్నారు, అయినా ఎదురొడ్డి నిలబడ్డారు. గత అరాచక పాలనలో చంద్రబాబును సైతం జైలుకు పంపారు, నాపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీతో సహా 23 కేసులు పెట్టారు. తగ్గకుండా అంతా కలిసి పోరాడాం. అధికారంలోకి వచ్చాం. ప్రతిపక్షంలో ఉన్నపుడు పోరాడతాం, యుద్ధం చేస్తాం. అధికారంలోకి వచ్చాక రిలాక్స్ అయిపోతాం. కష్టకాలాన్ని మర్చిపోకూడదు. చిన్నపాటి పొరపాటు జరిగినా అలిగి ఇంట్లో పడుకుంటున్నారు. ఇది కోవిద్ కన్నా ప్రమాదకరమైన జబ్బు. దానివల్ల నష్టపోయేది తెలుగుదేశం పార్టీ, ఆంధ్రరాష్ట్ర ప్రజలు.
రెండేళ్లలో ఎంతో సంక్షేమం చేశాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా 4వేల పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో కేవలం వెయ్యి మాత్రమే ఇస్తున్నారు. జులై మూడోవారంలో తల్లికి వందనం రెండోవిడత నగదు జమచేయబోతున్నాం.స్త్రీశక్తి కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం, దీపం పథకం కింద ప్రతిఏటా 3 సిలిండర్లు అందజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ, అన్నక్యాంటీన్, మత్స్యకారుల సేవలో, ఆటోడ్రైవర్ల సేవలో, చేనేతలకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందించాం. మెగా డిఎస్సీ ద్వారా పారదర్శకంగా 16వేల టీచర్ పోస్టులు భర్తీచేశాం. 10వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. గొడ్డలిపార్టీ అయిదేళ్ల పాలనలో కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు. ఆ గోతులు పూడ్చేందుకే 2వేల కోట్లు ఖర్చయింది. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తున్నాం. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పెట్టుబడులు, పరిశ్రమలు తెస్తున్నాం.
కార్యకర్తే అధినేత నినాదానికి కట్టుబడి ఉన్నాం
కార్యకర్తే అధినేత అనే నినాదానికి కట్టుబడి దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం అమలు చేస్తున్నాం. చనిపోయిన కార్యకర్తలకు 5లక్షల సాయం అందిస్తున్నాం. తప్పుడు కేసులన్నీ తీసివేసే బాధ్యత నేను తీసుకున్నాను. కార్యకర్తల సంక్షేమం కోసం 160కోట్లు ఖర్చుపెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం. కార్యకర్తలు సొంతకాళ్లపై నిలబడాలన్నదే మా ధ్యేయం. మిమ్మల్ని నిలబట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీది. క్లస్టర్ ఇన్ చార్జి, యూనిట్ ఇన్ చార్జిల శిక్షణా తరగతుల సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహస్తే, 75శాతం మందికి సుగర్, హైపర్ టెన్షన్ ఉన్నాయి. క్లస్టర్, యూనిట్, బూత్ నాయకులందరికీ పరీక్షలు చేయమని సిఎం చెప్పారు, ఆ కార్యక్రమం కూడా చేపడతాం. మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే బాధ్యత తీసుకుంటాం. యోగాంధ్రలో చంద్రబాబు గారు ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన స్పీడ్ అందుకోవడం కష్టం. ఆయన ప్రతిరోజూ యోగా చేస్తారు. తెలుగుదేశం పార్టీ కుటుంబం లాంటిది, చిన్నచిన్న సమస్యలు ఉంటాయి, కూర్చుని మాట్లాడుకుందాం. పార్టీలో సంస్కరణల కోసం నేను ఎంతో పోరాడాను. సమస్య ఎదురైతే పరిష్కారమయ్యేవరకు వందసార్లు పోరాడదాం. కష్టపడిన కార్యకర్తలను గుర్తించేందుకు ఇప్పుడు మైటిడిపి యాప్ తెచ్చాం. మీరు చేస్తున్న కష్టం ఈ యాప్ ద్వారా తెలియజేయండి, యాక్టివ్ గా ఉండండి. గ్రామస్థాయి నాయకుడ్ని పొలిట్ బ్యూరోలో కూర్చోబెట్టేవరకూ పోరాడాను. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి క్లస్టర్ ఇన్ చార్జి, మండల పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యారు. గ్రామస్థాయి నుంచి మార్పురావాలన్నది నా లక్ష్యం. పార్టీ మనది, దీనిని కాపాడుకోవడం మన బాధ్యత. కలసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలి.
తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టండి
సంక్షేమం చేపట్టినా ప్రజలకు దూరం కావడం వల్ల దేశంలో అనేక పార్టీలు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయాయి. సిద్ధాంతాలు మరిస్తే మనుగడ ఉండదు. గొడ్డలిపార్టీ సిద్ధాంతం విధ్వంసం, బూతులు, మహిళలను అవమానించడం, బలహీనులను చంపడం, దాడులు చేయడం, గొడ్డలిపార్టీకి ఎదురొడ్డి నిలబడే పార్టీ తెలుగుదేశం. వైసిపి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించే ఫేక్ పార్టీ. డిఎస్సీ అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తే తప్పుడు ప్రచారం చేశారు. గతంలో డిఎస్పీ ప్రమోషన్లలో కూడా ఇదే తరహా తప్పుడు ప్రచారంచేశారు. వాళ్లు అబద్ధం చెప్పినట్లుగా మనం నిజం కూడా చెప్పలేకపోతున్నాం. అందరూ కలసికట్టుగా గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారాన్ని గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టండి. ప్రతివిషయం పార్టీ చెప్పదు, మీ అంతట మీరే స్పందించాలి. ఏదైనా సమస్య నాదృష్టికి తీసుకొస్తే వింటా, సీరియస్ గా తీసుకుంటా, తప్పును సరిదిద్దుకొని ముందుకెళ్తా. పార్టీ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండండి. పొరుగు జిల్లాలో గొడ్డలిపార్టీకి చెందిన మాజీమంత్రి కొడుకుని కల్తీమద్యం కేసులో ఈడి అరెస్టు చేసింది. గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో జే బ్రాండ్స్ కారణంగా లివర్ సిరోసిస్ 200 శాతం పెరిగింది, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి.
జులై 10నుంచి ఇంటింటికీ ప్రచారం
ఇంటింటికీ ప్రచార కార్యక్రమాన్ని జులై 10వతేదీనుంచి ప్రారంభిస్తాం. సర్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశాం. సర్ ప్రక్రియపై అలసత్యం వద్దు, ప్రతిఓటు విలువైనది. అవనిగడ్డలో కమిటీలు పెండింగ్ లో ఉన్నాయి, యుద్ధప్రాతిపదికన పూర్తిచేయండి. కొన్ని విషయాల్లో అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది, 24గంటల్లో సరిచేయాలని ఆదేశించాం. దొంగ కేసులను సహించబోను. మంత్రి, జోనల్ కోఆర్డినేటర్ తో మాట్లాడాను. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. త్వరలో నియోజకవర్గానికి అందరికీ ఆమోదయోగ్యమైన ఇన్ చార్జిని వేస్తా.
కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగాలి
కూటమి అనేది దీర్ఘకాలంగా కొనసాగాలి, సమస్యలు పరిష్కరించే బాధ్యత మేం తీసుకుంటాం, నో మిస్ ఫైర్, నో క్రాస్ ఫైర్, నో విడాకులు. అంతా కూటమి ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఎంత బాగా పనిచేసినా 1989లో అన్నగారిని ఓడించారు, బాబుగారిని కూడా పలుమార్లు ఓడించారు, కియా తెచ్చిన చోట ఓడిపోయాం. ఇప్పుడు టిడిపి 3.0 నడుస్తోంది. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వారితో మమేకం కావాలి. అధికారంలోకి వచ్చామన్న అహంకారం వీడాలి. కలసికట్టుగా పనిచేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు, ఇది మర్చిపోవద్దు. అందరం టిడిపి దేవాలయానికే రావాలి, అది మర్చిపోవద్దు. ఈ సమావేశంలో కృష్ణాజిల్లా ఇన్ చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, సిఎంఓ కార్యక్రమాల సమన్వయకర్త, జోనల్ ఇన్చార్జి సత్యనారాయణరాజు పాల్గొన్నారు.








