ఓవైపు చర్చలు.. మరోవైపు భీకరదాడులు..! అమెరికా ద్వంద్వ వ్యూహం..!
ఇరాన్ ను చర్చలకు ఒప్పించేందుకు అమెరికా మరోసారి తన ఆయుధాలకు పని చెప్పింది. శాంతిచర్చల సమయంలో తన డిమాండ్లకు టెహ్రాన్ తలొగ్గకపోవడంతో.. ఇరాన్ లోని దక్షిణ ప్రాంతాలపై భీకర దాడులు చేసింది. బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఆత్మరక్షణ కోసమే తాము ఇరాన్ క్షిపణి ప్రయోగ లాంచ్ప్యాడ్లు, సముద్రంలో మందుపాతరలు పరిచే బోట్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.
సముద్రంలో మందుపాతరలు పరిచేందుకు యత్నిస్తున్న బోట్లను ధ్వంసం చేసినట్లు అమెరికన్ ప్రతినిధులు వెల్లడించారు. తమ దేశానికి చెందిన రెండు విమాన వాహక నౌకలు, రెండు డజన్లకు పైగా యుద్ధ నౌకలకు తీరం వెంట ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలు ముప్పుగా పరిణమించినట్లు వారు తెలిపారు. తమ దాడిలో బందర్ అబ్బాస్ పోర్టులోని నేవీ బేస్ కూడా ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇరాన్ వైపు లర్క్ ద్వీపంలో కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
నేడు ఖతార్‌లో చర్చలు..
యుద్ధం ముగింపుపై నేడు ఖతార్ రాజధాని దోహాలో ఇరాన్-అమెరికా దూతలు చర్చలు జరపనున్నారు. కొన్నాళ్లక్రితం ఇరాన్ తమ క్షిపణి ప్రయోగకేంద్రాలు, అండర్‌గ్రౌండ్ ఫెసిలిటీలను పునరుద్ధరించిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. మొత్తం 33 మిసైల్ సైట్లలో 30 వరకు తిరిగి పనిచేయడం మొదలుపెట్టినట్లు గుర్తించాయి. దీంతోపాటు దేశవ్యాప్తంగా 70శాతం మొబైల్ మిసైల్ లాంచర్లను మోహరించినట్లు చెప్పాయి.
అమెరికాతో పరోక్ష చర్చల్లో భాగంగా పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ నేతృత్వంలోని ఇరాన్ బృందం సోమవారం ఖతార్‌కు వెళ్లింది. అక్కడ కీలక సంప్రదింపులు జరిపింది. ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ విలేకర్లతో మాట్లాడుతూ.. అమెరికాతో అత్యధిక అంశాలపై అవగాహన కుదిరిందన్నారు. అయితే చేయాల్సిన పని ఇంకొంత మిగిలేఉందని పేర్కొన్నారు. లెబనాన్ సహా అన్ని చోట్ల యుద్ధం ముగించడం పైనే తాము దృష్టిపెట్టినట్లు చెప్పారు. అణ్వస్త్రాల గురించి ప్రస్తుతం మాట్లాడటం లేదన్నారు. యుద్ధం ముగింపుపై అవగాహన ఒప్పందం కుదిరితే.. ఆపై 60 రోజుల వ్యవధిలో అణు సంబంధిత అంశాలపై చర్చలు జరుపుతామని చెప్పారు.







