తాలిబన్లతో రష్యా తొలి డిఫెన్స్ ట్రీట్.. పాక్ కలవరం..!
పాకిస్తాన్ కు గట్టి షాక్.. పొరుగున ఉన్న ఆఫ్గనిస్తాన్.. క్రమంగా రష్యాకు దగ్గరవుతోంది. ఇటీవలి వరకూ ఆఫ్గన్ లో తాలిబన్ల పాలనను తీవ్రంగా వ్యతిరేకించిన రష్యా.. ఇప్పుడు వారితో భుజం కలిపి నడుస్తోంది. ఈపరిణామం ఆసియాలో రాజకీయ పరిణామాలు, బలాబలాలను మార్చే అవకాశం ఉందని రాజనీతిజ్ఞులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఆఫ్గన్, పాక్ సర్కార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి. ఇలాంటప్పుడు ఆఫ్గన్ .. రష్యాతో సైనిక – సాంకేతిక ఒప్పందం కుదుర్చుకోవడం పాక్ కు కలవరం కలిగిస్తోంది.
ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వంతో రష్యా తన మొట్టమొదటి అధికారిక సైనిక-సాంకేతిక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో ఆఫ్ఘన్ రక్షణ మంత్రి మహ్మద్ యాకూబ్, రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా తాలిబాన్లకు ఆయుధాల సరఫరా, సైనిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, శిక్షణ, సంయుక్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది.
గతంలో తాలిబాన్లను వ్యతిరేకించిన రష్యా, 2025లో తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా నిలిచింది. ఇప్పుడు ఏకంగా వ్యూహాత్మక భద్రతా భాగస్వామిగా మారడం చెప్పుకోదిన పరిణామం. మాస్కోపై జరిగిన ‘క్రాకస్ సిటీ హాల్’ దాడి తర్వాత ఐసిస్-కె (ISIS-K) ఉగ్రవాద సంస్థను అణచివేయడం రష్యాకు అత్యంత కీలకంగా మారింది. అలాగే, 2021లో అమెరికా నిష్క్రమణ తర్వాత ఏర్పడిన శూన్యతను భర్తీ చేస్తూ మధ్య ఆసియాలో తన పట్టును నిలుపుకోవాలని రష్యా భావిస్తోంది.
ఈ రక్షణ ఒప్పందం పాకిస్థాన్‌కు తీవ్ర కలవరాన్ని కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో సరిహద్దు ఘర్షణలు, టీటీపీ (తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్) ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ ఆశ్రయం కల్పిస్తోందనే పాక్ ఆరోపణల వల్ల తాలిబాన్-పాక్ సంబంధాలు క్షీణించాయి. ఇప్పుడు తాలిబాన్లకు రష్యా ఆయుధాలు అందిస్తే అది ఇస్లామాబాద్‌కు ప్రత్యక్ష భద్రతా సవాలుగా మారుతుంది. ఇది భారత్‌కు సానుకూల పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.








