టీఎంసీ కార్యకర్తలు బెదిరిస్తున్నారు.. రోడ్డుపైకి వచ్చేసిన ప్రజలు
బెంగాల్ లో ఎన్నికల పోలింగ్ సమయంలోనూ హింస చెలరేగింది. చాలా ప్రాంతాల్లో సంఘర్షణలు కూడా జరిగాయి. అయితే.. ఓట్ల లెక్కింపుకు రెండు రోజుల ముందు కూడా బెంగాల్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓట్ల లెక్కింపుకు ముందు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమను బెదిరిస్తున్నారని, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ బెంగాల్ లో స్థానికులు భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చేశారు. దీంతో సౌత్ 24 పరగణాలలోని పాల్టాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు, కార్యకర్తలు తమను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు రోడ్లెక్కారు. తమ ప్రాంతంలో తిరిగి పోలింగ్ నిర్వహించాలని డిమాండ్లు చేస్తున్నారు. అలాగే తమ భద్రత కోసం, స్వేచ్ఛగా ఓటు వేయడానికి కేంద్ర భద్రతా బలగాలను కూడా అధికంగా మోహరించాలని డిమాండ్లు చేస్తున్నారు.
దీంతో అధికారులు ప్రతిస్పందించారు. అధికారులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కీలక ప్రదేశాలలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. అలాగే సీఆర్పీఎఫ్ వాహనాన్ని కూడా అక్కడే వుంచారు.పలువురు మహిళలతో సహా స్థానికులు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘‘వీళ్లు గెలిస్తే మా ఇళ్లను తగలబెట్టేస్తారు. రక్తపాతం సృష్టిస్తారు. టీఎంసీకి చెందిన ఇస్రాఫిల్ చౌకీదార్ మమ్మల్ని బెదిరించారు. అంటూ మహిళలు పేర్కొనడం గమనార్హం. “నిన్నటి నుండి ఇదే జరుగుతోంది. TMC గూండాలు మా గ్రామంలోకి చొరబడి, మహిళలను వేధించారు మరియు ప్రజలను కొట్టారు. మా గ్రామ పంచాయతీ అధిపతి TMCకి చెందినవారే; ఆయన ప్రజల ఓట్లతో అధికారంలోకి రాలేదు, ఆ పార్టీ ద్వారా ఎంపికయ్యారు. జహంగీర్ ఖాన్ ఇక్కడికి వచ్చి, ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వస్తే మా మహిళలపై అత్యాచారం చేస్తామని, మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. అందుకే నిన్నటి నుండి ప్రజలు అప్రమత్తమయ్యారు.” అని స్థానికులు పేర్కొంటున్నారు.
మేము డం డం రోడ్డుపై సమ్మె నిర్వహించాము, అది నిన్న రాత్రి వరకు కొనసాగింది. ఈ రోజు ఉదయం 10 గంటల వరకు మాకు గడువు ఇచ్చారు. ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో, ఆ వ్యక్తిని ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించడానికి మేము మళ్ళీ బయటకు వచ్చాము. పోలీసులు అక్కడికి వచ్చి లాఠీచార్జి చేశారు’’ అని కూడా చెప్పుకొచ్చారు.








