దళపతి విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత.. చెన్నైలో టీవీకే కార్యకర్తల కోలాహలం!
Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సంచలన పర్వాన్ని కొనసాగిస్తోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుండి అప్రతిహతంగా దూసుకుపోతున్న టీవీకే, ప్రస్తుతం 90కి పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. తొలి ప్రయత్నంలోనే విజయ్ పార్టీ ఈ స్థాయిలో ప్రభావం చూపడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
విజయ్ నివాసం వద్ద హై-అలర్ట్..
టీవీకే అంచనాలకు మించి రాణిస్తుండటంతో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఫలితాల ట్రెండ్స్ చూసి ఉత్సాహంతో ఉన్న అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున అక్కడికి చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది.
రహదారులన్ని పోలీసుల నియంత్రణలో ..
విజయ్ నివాసానికి వెళ్లే రహదారులన్నింటినీ పోలీసులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అదనపు బలగాలను రంగంలోకి దించి, ఆ ప్రాంతంలో సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కేవలం అనుమతి ఉన్న వారిని మాత్రమే తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు.
సంబరాల్లో టీవీకే శ్రేణులు..
రాష్ట్రవ్యాప్తంగా టీవీకే గెలుపు ఖాయమన్న ధీమాతో కార్యకర్తలు మిఠాయిలు పంచుతూ, టపాసులు కాల్చుతూ సంబరాల్లో మునిగిపోయారు. జనసమ్మర్థం పెరిగే అవకాశం ఉండటంతో శాంతిభద్రతల దృష్ట్యా భద్రతను మరింత పెంచుతామని ఉన్నతాధికారులు ప్రకటించారు.
రాజకీయ రంగ ప్రవేశం చేసిన మొదటి ఎన్నికల్లోనే ‘దళపతి’ తనదైన ముద్ర వేయడంతో తమిళ రాజకీయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
ఇవి కూడా చదవండి








