గంగా విలాస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. 51 రోజులకు రూ. 20 లక్షలు
ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పర్యాటక నౌక ఎంవీ గంగా విలాస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వారణాసిలో మొదలైన ఈ గంగా విలాస్ ప్రయాణాన్ని వర్చువల్‌గా మోదీ ప్రారంభించారు. భారత్‌లో కొత్తతరం పర్యాటకానికి ఇది నాంది పలుకుతోందన్నారు. అంతేకాకుండా ఇది కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో ఇటువంటి నదీ పర్యాటక నౌకలు రానున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా విదేశీ పర్యాటకులకు ఆహ్వానం పలికిన మోదీ తద్వారా భారత్ గొప్పతనాన్ని స్వయంగా ఆస్వాదించవచ్చని పిలుపునిచ్చారు. భారత్‌లో తయారైన ఈ తొలి నౌక లో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులు మొదటి ప్రయాణాన్ని చేయనున్నారు.
వారణాసి నుంచి మొదలై అసోంలోని దిబ్రూగఢ్ వరకు వీరి ప్రయాణం సాగుతుంది. మధ్యలో బంగ్లాదేశ్ జల్లాల్లోనూ ఈ నౌక పయనిస్తుంది. రెండు దేశాల్లో 27 నదుల గుండా సాగే గంగా విలాస్ ప్రయాణ మార్గంలో 50 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంటుంది. 18 సూట్లు ఉండే ఈ నౌకలో 36 మంది పర్యాటకులు ప్రయాణించవచ్చు. మూడు సన్డెక్లు, జిమ్ సెంటర్‌తో పాటు, స్పా వంటి లగ్జరీ సదుపాయాలు ఉన్నాయి. 51 రోజుల పాటు 3200 కి.మీ. దూరం సాగే ఈ ప్రయాణంలో ఒక్కొక్కరికి ప్రతి రోజు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చువుతుంది. మొత్తం 61 రోజుల ప్రయాణానికి ఒక్క్కొరికి సుమారు 13 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు అవనున్నట్లు క్రూజ్ నిర్వాహకులు వెల్లడిరచారు.













