గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకూ బీజేపీయే : ప్రధాని మోదీ
బెంగాల్ తో పాటు అసోం, పుదుచ్చేరిలో బీజేపీ విజయం దేశ ఉజ్వల భవిష్యత్తుకు నాంది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మూడు రాష్ట్రాల్లో విజయం సందర్భంగా ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు విజయ్ నబీన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఘన విజయంతో బీజేపీ కార్యకర్తలు చరిత్ర సృష్టించారన్నారు. ఈ ఆనందంలో తాను కూడా పాలు పంచుకుంటున్నట్లు తెలిపారు. బెంగాల్ లో బీజేపీ ఘన విజయంతో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకూ కమలం వికసించిందన్నారు. ప్రజాస్వామ్యంపై, పనితీరు రాజకీయాలపై విశ్వాసం చూపించే రోజు అని అభివర్ణించారు.
నేటి నుంచి బెంగాల్ లో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని ప్రధాని ప్రకటించారు. నేడు 20 కి పైగా రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు వున్నాయని ‘‘నాగరిక్ దేవో భవ’’ అనేదే తమ మంత్రమని ప్రకటించారు. ప్రజలు రానూ రానూ తమ పార్టీని ఎక్కువగా విశ్వసిస్తున్నారని చెప్పుకొచ్చారు. బెంగాల్ లో తొలిసారి భయం కాదు, ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. దేశ ప్రజల మనోభావాలను, సంస్కృతిని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని, కాంగ్రెస్, టీఎంసీ, ఇతులు కొన్ని రోజుల క్రితం నారీశక్తిని అడ్డుకున్నారన్నారు.
పార్టీలన్నీ ప్రతీకారం కోసం కాకుండా, మార్పు కోసం పనిచేయాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ‘‘బెంగాల్ లో భయంపై ప్రజాస్వామ్యం విజయం సాధించింది. బీజేపీ గెలిచింది కాబట్టి, అక్కడ ప్రతీకారం గురించి కాకుండా మార్పు గురించి మాట్లాడుకోవాలి. భయం గురించి కాకుండా భవిష్యత్తు గురించి చర్చ జరగాలి. హింసా మార్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు విడిచిచేయాలి’’ అని మోదీ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి








