వీర విధేయునికా? సంస్థాగతంగా పటిష్ఠం చేసిన వారికా? సీఎం ఎవరు?
కేరళ ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా సస్పెన్స్ వీడనేలేదు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేది మాత్రం అధిష్ఠానమే. దీంతో రకరకాల పేర్లు బయటికి వస్తున్నా… ముఖ్యంగా ఇద్దరి మధ్యే ఈ వ్యవహారం నలుగుతోందని వినిపిస్తోంది. అందులో ఒకరు కేసీ వేణుగోపాల్, రెండో వ్యక్తి రమేశ్ చెన్నితల. ఈ ఇద్దరి పేర్లతో కూడిని షార్ట్ లిస్ట్ అధిష్ఠానినికి చేరింది. ఈ ఆదివారాని కల్లా అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. అధిష్ఠానం కూడా ఊగిసలాటలో వున్నట్లు సమాచారం. ఒకరు కేసీ వేణుగోపాల్. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. రాహుల్ కోటరీలో ప్రప్రథమ నేత ఎవరంటే ఠక్కున అందరూ చెప్పేది కేసీ వేణుగోపాల్ పేరునే. ప్రస్తుతం అలప్పుజ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా వున్నారు. రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా… దాని వెనుక కేసీ వేణుగోపాల్ వుంటారని అంటుంటారు. పైగా గాంధీ కుటుంబానికి విధేయుడు. ఈ నేపథ్యంలో ఈయన పేరు షార్ట్ లిస్టులో చేరిపోయింది. అలాగే ప్రముఖమైన నాయర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి.
కేరళలో కమ్యూనిస్టులను తట్టుకొని, పార్టీ కేడర్ ను కాపాడుకోవడంలో కేసీ వేణుగోపాల్ కూడా కీలక పాత్ర పోషించారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా కూడా వున్నారు. దాదాపు 47 మంది ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ పేరునే సూచిస్తున్నారు. సన్నీతో పాటు, ఎన్నికైన శాసనసభ్యులలో సందీప్ జి. వారియర్, సజీవ్ జోసెఫ్, టి. ఓ. మోహన్ మరియు ఉషా విజయన్ తదితరులు వేణుగోపాల్ పేరును ప్రతిపాదించారు.
ఇక.. మరో పేరు రమేశ్ చెన్నితల. కేరళ కాంగ్రెస్ లో సీనియర్ నేత. ఈయన కూడా నాయర్ కమ్యూనిటికీ చెందిన నేతనే. కేరళకు హోంమంత్రిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా కేరళ పీసీసీ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. సంస్థాగతంగా మంచి పట్టుంది. కానీ.. కేసీ వేణుగోపాల్ అధిష్ఠానానికి వున్నంత దగ్గరగా చెన్నితల లేరు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా కేసీ వేణుగోపాల్ పేరునే సూచిస్తున్నారు. దీంతో రమేశ్ చెన్నితల ఇరకాటంలో పడిపోయారు.
అయితే.. కాంగ్రెస్ ఎప్పుడు కూడా అధిష్ఠానానికి వీర విధేయులను మాత్రమే అధికార పీఠాలపై కూర్చొబెడుతుంది. అలా చూసుకుంటే కేసీ వేణుగోపాల్ ముందు వరుసలో వుంటారు. అయితే.. సంస్థాగతంగా కేడర్ తో బాగా టచ్ లో వుండే వ్యక్తి మాత్రం రమేశ్ చెన్నితల. కేసీ వేణుగోపాల్ ఢిల్లీ వ్యవహారాలను ఎక్కువగా చూస్తుంటారు. చెన్నితల మాత్రం పూర్తిగా కేరళకే పరిమితం అయ్యారు. దీంతో ఎవరికి వస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి








