అది తప్పుడు నిర్ణయమే…
అమెరికాలోని టెక్సాస్‌లో ఓ పాఠశాలలో ఇటీవల ఓ యువకుడు తుపాకితో విరుచుకుపడి 21 మందిని కాల్చిచంపాడు. ప్రాణాలు కోల్పోయిన వారిలో 19 మంది చిన్నారులు ఉన్నారు. ఈ విషయంలో పోలీసులు సరిగా స్పందించలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రాణ నష్టం భారీగా పెరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై పోలీసులు స్పందించారు. తప్పు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ ఘటనపై టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ కల్నల్ స్టీవెన్ మెక్‌క్రా మాట్లాడుతూ ఘటనా స్థలంలో ఆసలేం జరిగిందో వివరించారు. కాల్పుల సమాచారం అదుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాఠశాలలో పక్కపక్కనే ఉన్న తరగతి గదుల్లోకి ప్రవేశించిన నిందితుడిని కట్టడి చేశారు. దీంతో పిల్లలకు ఇక ఏమీ కాదని, ప్రాణనష్టం తప్పిందని భావించారు. నిందితుడిని ఎదుర్కొనేందుకు వేచి ఉండాలని ఆన్సైట్ కమాండ్, స్కూల్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఛీప్ నిర్ణయించారు. సరిగ్గా ఈ నిర్ణయమే మరింత ప్రాణ నష్టానికి దారితీసిందన్నారు.













