భారతీయ మహిళకు నాసా కిరీటం.. అంతరిక్ష సంస్థ సారథిగా భవ్యాలాల్
అత్యంత ప్రతిష్ఠాత్మక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు ఆపద్ధర్మ అధిపతిగా భారతీయ సంతతికి చెందిన భవ్యాలాల్ను బైడెన్ ప్రభుత్వం నియమించింది. భారతీయ సంతతికి చెందినవారికే కాక, భారతీయులందరికీ గర్వకారణమైన ఈ నియామకం పట్ల హర్షించని భారతీయుడు లేడు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో, ఇంజనీరింగ్‌లో అపారమైన అనుభవం ఉన్న భవ్య మొదటి నుంచీ అంతరిక్ష విజ్ఞానం పట్ల విశేషమైన పరిశోధనాసక్తి ప్రదర్శిస్తూ వచ్చారు. ఆ కారణంగానే ఆమెకు అంత పెద్ద పదవిని బైడెన్ కట్టబెట్టారు.
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)కు సంబంధించిన బడ్జెట్, ఆర్థిక వ్యవహారాల సీనియర్ సలహాదారు బాధ్యతలను కూడా భవ్య చేపట్టబోతున్నారు. నాసా భవిష్య ప్రణాళికలపై జో బైడెన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ ఏజెన్సీ రివ్యూ టీమ్’లో ఆమె సభ్యురాలిగా పనిచేశారు.
కాగా, 2005 నుంచి 2020 వరకూ సుమారు 15 ఏళ్లపాటు భవ్య ‘ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ ఎనాలిసిస్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇన్స్టిట్యూట్’ అధ్యయన బృందంలో పని చేశారు. ఆ సమయంలో ఆమె వైట్‌హౌస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కార్యాలయం, నేషనల్ స్పేస్ కౌన్సిల్‌కు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాలు, విధానాల రూపకల్పనలో ఎంతో క్రియాశీలంగా, ఉత్సాహంగా విశిష్ట సేవలు అందించారు.
అంతేకాక, నాసా, రక్షణ విభాగం, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ సంస్థలకు కూడా భవ్య సేవలందించారు. న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో ఆమె డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడమే కాక, పరిశోధనలు కూడా చేసి డాక్టరేట్లు పొందారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టెక్నాలజీ అండ్ పాలసీ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. తన రెండు దశాబ్దాల కెరీర్లో 50కి పైగా పరిశోధన పత్రాలు తయారుచేసిన భవ్య వాటిని ప్రతిష్ఠాత్మక సైన్స్ జర్నల్స్‌లో ప్రచురించారు.
ఇక అయిదు నేషనల్ అకాడమీ సైన్స్ కమిటీలకు కూడా ఆమె సేవలు అందించారు. వాటిలో కమర్షియల్ రిమోట్ సెన్సింగ్కు సంబంధించి నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అడ్వయిజరీ కమిటీకి రెండేళ్లపాటు ఆమె సేవలందించడం జరిగింది. నాసాకు సంబంధించిన ఏజెన్సీ చేస్తున్న ‘ఇన్నొవేటివ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ అండ్ ది టెక్నాలజీ’తో పాటు, నాసాకే చెందిన ఇంజనీరింగ్ అడ్వయిజరీ కమిటీలకు కూడా సభ్యురాలిగా భవ్య చాలాకాలంగా సేవలందిస్తున్నారు.
అపారమైన అంతరిక్ష అనుభవం
శాస్త్ర సాంకేతిక విధానాల అధ్యయనాలు, కన్సల్టింగ్‌కు సంబంధించిన సంస్థ ఎస్‌టిపిఎస్ అధ్యక్షురాలిగా, అమెరికా న్యూక్లియర్ సొసైటీ సహ వ్యవస్థాపకురాలిగా కూడా ఆమె పనిచేశారు. ఈ అనుభవంతోనే ఆమె అంతరిక్ష పరిశోధనలకు చెందిన ప్రతి అంతర్జాతీయ సదస్సులోనూ ఆమె పాల్గొనడం జరుగుతుంటుంది. ఈ సదస్సులకు ఆమె ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తుంటారు. ఇవి కాక, అంతరిక్ష చరిత్ర, సదస్సులు, గోష్ఠుల నిర్వహణలో ఆమె ఎప్పుడూ ముందుంటారు.
స్పేస్ టూరిజంపై విశేషమైన ఆసక్తి, పట్టు ఉన్న భవ్య ‘స్పేస్ ఎకానమీ’ గురించి లోతుగా అధ్యయనం చేశారు. స్పేస్ ఎకానమీలో ముఖ్యంగా నాలుగు భాగాలుంటాయని ఆమె తరచూ వివరిస్తుంటారు. ఇందులో ఒకటి అంతరిక్ష రంగంపై ప్రభుత్వం పెట్టే ఖర్చు. అంతరిక్షంపై చేసే అధ్యయనాలు, సైన్స్, మిలిటరీ ప్రోగ్రామ్స్ దీని కిందకు వస్తాయి. ఇక రెండోది, అంతరిక్ష సేవలు, మూడోది, స్పేస్ సప్లయర్ ఇండస్ట్రీ, నాలుగోది, స్పేస్ సర్వీస్ యూజర్ సపోర్ట్ ఇండస్ట్రీ. అంతరిక్ష రంగాన్ని ఈ నాలుగూ అనూహ్యమైన పురోగతిలో పరుగులు పెట్టిస్తాయని ఆమె చెబుతుంటారు.













