ప్రవాస భారతీయుడికి జియోగ్రాఫిక్ పురస్కారం
నేషనల్ జియోగ్రాఫిక్ మొట్టమొదటి పిక్చర్ ఆఫ్ ది ఇయర్ పోటీలో ఇండియన్ అమెరికన్ కార్తీక్ సుబ్రమణ్యం విజేతగా నిలిచాడు. సిలికాన్ వ్యాలీకి చెందిన భారతీయ అమెరికన్, సాఫ్ట్వేర్ డెవలపర్ ఫొటోగ్రఫీపట్ల మక్కువతో తీసిన చిత్రం అవార్డుకు ఎంపికైంది. అలస్కాలోని చిల్కాట్ బాల్డ్ ఈగల్ ప్రిజర్వ్లో ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించాడు. మోడువారిన చెట్టుకొమ్మపై చోటు కోసం రెండు ఈగల్స్ పోట్లాడుకునే ఈ చిత్రం నేషనల్ జియో గ్రాఫిక్ పిక్చర్ ఆఫ్ ది ఇయర్ పోటీలో గెలుపోందింది. డాన్స్ ఆఫ్ ది ఈగల్స్ అని ఈ చిత్రానికి శీర్షికను ఇచ్చారు. చిల్కట్ బాల్డ్ ఈగిల్ అలస్కాలోని హైన్స్ సమీపంలో సాల్మన్ చేపలను తినేందుకు ప్రతి ఏటా నవంబర్లో ఇక్కడికి వస్తుంటాయి. గత రెండేళ్లుగా నేను అక్కడికి వెళ్తున్నాను. గతేడాది అనూహ్యంగా ఈ డేగలు నా కంటపడ్డాయి. అయితే ఈ ఫోటో కు ఇంతటి గుర్తింపు వస్తుందని అనుకోలేదని సుబ్రమణ్యం తెలిపారు. ఈ ఫోటోను నేషనల్ జియోగ్రాఫిక్ మేగజైన్ మే సంచికలో ప్రచురిస్తారు. ప్రకృతి, వ్యక్తులు, ప్రదేశాలు, జంతువులు ఇలా నాలుగు విభాగాల్లో ఫొటోలను ఎంపిక చేసి విజేతలను ప్రకటించారు.













