భారతీయ అమెరికన్ కు ప్రతిష్ఠాత్మక.. పురస్కారం

నూతన ఆవిష్కరణలకు ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మక ఐరోపా అవార్డును భారత అమెరికన్ రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్ర గెల్చుకున్నారు. నానో టెక్నాలజీ సాయంతో దంత వైద్యం కోసం ఆవిష్కరణలు చేసినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఆమె పరిశోధనల కారణంగా పళ్లకు బలమైన, మరింత ఆకర్షణీయమైన ఫిల్లింగ్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా దంత వైద్యులు వాటిని వాడుతున్నారు. యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు-2021 అనే ఈ పురస్కారాన్ని యూరోపియన్ పేటెంట్ ఆఫీస్ (ఈపీవో) ప్రకటించింది. ఈపీలో వెలుపలి దేశాల విభాగంలో పురస్కారానికి సుమిత ఎంపికయ్యారు.
దంత క్షయానికి గురైన లేదా విరిగిపోయిన పళ్లలో ఖాళీలను పూరించడానికి అనువైన పదార్ధం కోసం 1990ల చివరి వరకూ దంతవైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ అవసరం కోసం నాడే మిశ్రమ పదార్థాల్లో అనేక లోపాలు ఉండేవి. కొరకడానికి ఉపయోగించే పళ్లపై వాడలేనంత బలహీనంగా ఉండటమో లేక తర్వగా పాలిష్‍ను కోల్పోవడమో జరిగేది. ఈ నేపథ్యంలో దంత వైద్యంలో నానో క్లస్టర్లను ఉపయోగించొచ్చని సుమిత రుజువు చేసినట్లు ఈపీవో ఒక ప్రకటనలో పేర్కొంది. ఫలితంగా దృఢమైన, దీర్ఘకాలం మన్నే, ఆకర్షణీయమైన దంత ఫిల్లింగ్స్ సాధ్యమైనట్లు వివరించింది. సుమిత పూర్తిగా కొత్త పథకాన్ని ఎంచుకున్నారు. పేటెంట్ల రక్షణ కలిగిన సాంకేతిక ఆవిష్కరణలు ఒక రంగంలో తీసుకొచ్చే విప్లవాత్మక మార్పులను ఆమె కళ్లకు కట్టారు. 20 ఏళ్ల తర్వాత కూడా ఆమె అభివృద్ధి చేసిన సాంకేతికత వాణిజ్యపరంగా విజయవంతంగానే సాగుతోంది. కొత్తతరం శాస్త్రవేత్తలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు అని ఈపీవో అధ్యక్షుడు ఆంటోనియో క్యాంపినోస్ పేర్కొన్నారు.