వాట్స్ దీపావళి వేడుకలు… 2000 మందికి పైగా హాజరు
వాషింగ్టన్ తెలుగు సమితి ఆధ్వర్యంలో అక్టోబర్ 29 శనివారం సాయంత్రం నిర్వహించిన దీపావళి, వాట్స్ 20 వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా రెంటన్ ఐకియా పెర్ఫార్మన్స్ సెంటర్ లో జరిగాయి. ఈ వేడుకలకోసం ఇండియా నుంచి విచ్చేసిన తారలు మరియు వాషింగ్టన్ నలుమూలల నుండి వచ్చిన 2000 మందికి పైగా శ్రోతలతో ఆడిటోరియం కళకళ లాడిరది. అధ్యక్షులు శ్రీనివాస్ అబ్బూరి నాయకత్వంలో కార్యనిర్వాహక సభ్యులు రెండు నెలలుగా ఎంతో శ్రమించి వినూత్నంగా రూపొందించిన దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు ఎనిమిది గంటల పాటు దాదాపు 79 సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా సాగాయి. 180 మందికి పైగా చిన్నారులు, పెద్దలు చేసిన తెలుగు సాంస్కృతిక, చలన చిత్ర నృత్య ప్రదర్శనలు, పాడిన గీతాలు అందరినీ అలరించి ప్రతి ఒక్కరి హృదయాలను చూరగొన్నాయి.
ఈవెంట్‌ను మరింత వినోదాత్మకం సరదాగా ఉండేలా కొరియోగ్రాఫర్లు చేసిన కృషి ఫలించింది. అలాగే మొదటిసారిగా, పిల్లలు, కొరియోగ్రాఫర్లలో సృజనాత్మకతను ప్రేరేపించేందుకు వీలుగా, వారి నైపుణ్యాలను వెలికితీసేందుకు, వారిని ప్రోత్సహించేలా వాట్స్ కార్యవర్గం కార్యక్రమాలన్నిం టినీ పోటీలుగా నిర్వహించింది. జడ్జి ప్యానెల్- స్వాతి దర్బ, శాంతి లాస్య, లీలా గోగినేని, భావన కుడికల, వైష్ణవి అక్కినేపల్లి, ప్రమీలా రాణి, అన్విత కొండహౌస్ ఈవెంట్‌ను అంతా ఓపికగా కూర్చుని ప్రదర్శనలు తిలకించి విజేతలను ఎంపిక చేసారు.
అమెరికా హౌస్ ఆఫ్ కాంగ్రెస్ సభ్యులైన మంక దింగ్ర, వందన స్లాటర్, డెరెక్ స్టాన్ఫోర్డ్ విశేష అతిధులుగా విచ్చేసి తమ అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో చిన్నారులు తమ అద్భుత ప్రదర్శనలతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఇండియా నుండి విచ్చేసిన డి జె టిల్లు ఫేమ్ నేహా శెట్టి డాన్సులతో మరియు లావణ్య గూడూరు హుషారైన యాంకరింగ్ తో కార్యక్రమాలన్ని ఆకట్టుకున్నాయి. ప్రెసిడెంట్ శ్రీనివాస్ అబ్బూరి చేసిన సియాటిల్ అన్‌స్టాపబుల్ టాక్ షో హైలైట్‌గా నిలిచింది. సియాటిల్ బాలయ్యగా అబ్బూరి శ్రీనివాస్ ఆహార్యం, ఛలోక్తులు అతిధులను ఆకట్టుకున్నాయి. ఒక దశలో హీరోయిన్ నేహా శెట్టి కన్నా బాలయ్య గెటప్‌లో ఉన్న అబ్బూరిగారితో సెల్ఫీ లు దిగటానికి పిల్లలు, పెద్దలు పోటీ పడ్డారు. ప్రముఖ నాటక కళాకారులు దేవినేని రాజేంద్ర ప్రసాద్ ఏకపాత్రాభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వాట్స్ 20 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా పూర్వ ప్రెసిడెంట్స్ అందరితో చేసిన శుభాకాంక్షల వీడియో ఆహుతులను అలరించింది. నవరుచులతో ఏర్పాటు చేసిన దీపావళి విందు అందరినీ సంతృప్తి పరచింది.
ప్రెసిడెంట్ శ్రీనివాస్ అబ్బూరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వనితులకు, ఇంతటి విజయవంతం కావటానికి సహకరించిన కార్యవర్గానికి, కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి వినూత్నంగా స్పాన్సర్స్‌కు ముఖ్యంగా తెలుగును ముందు తరాలకు తీసుకు వెళ్ళటంలో ముఖ్య భూమిక పోషిస్తున్న సియాటిల్ సంఘ సేవకులను శాలువాలతో సత్కరించారు. అనంతరం శ్రీనివాస్ అబ్బూరి అధ్యక్షులుగా తన ఈ సంవత్సర కార్యక్రమాలను వివరించారు. మన సంస్కృతీ, సంప్రదాయాల ఉద్దీపనకి, మన తెలుగు కమ్యునిటీ సంక్షేమానికి వాట్స్ చేస్తున్న కృషిని మరియు తాము భవిష్యత్తులో నిర్వహించబోయే కార్యక్రమాలను వివరించి మా గొప్ప స్పాన్సర్లు లేకుండా ఇదంతా సాధ్యం కాదని అంటూ, ప్రత్యేకించి మా డబుల్ మెగా రాయల్, టాక్ షో స్పాన్సర్లు శ్రీనివాస్ తుమ్మల, ఎంఎస్ఆర్ కమ్యూనిటీస్ నుండి శివ గోపాల్, మరొక మెగా రాయల్ స్పాన్సర్ ట్రిటన్ హోమ్స్‌కి ఫుడ్ స్పాన్సర్లు నమస్తే ఇండియా, స్వాగత్లకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వాలంటీర్ల మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదని అంటూ, ముఖ్యంగా మా యువ వాలంటీర్లు ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సక్సెస్ చేయడంలో తమ వంతు సహకారం అందించారని వారికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.













