ప్రవాసులకు ఉచితంగా బీమా
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న పేద ప్రవాసాంధ్రులకు ఉచితంగా బీమా ధీమా లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవాసీ మహిళల సంక్షేమం-భద్రత నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎన్నార్టీ సంస్థ ద్వారా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దుబాయిలో స్వల్ప వేతనాలకు ఇళ్లలో పనిచేస్తున్న ఏపీ మహిళలను బీమా పథకంలో చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రానికి చెందిన మహిళలతో పాటు స్వల్ప వేతనాలకు పనిచేస్తున్న పురుష కార్మికులకు అవసరమైన ప్రీమియంను ఆంధ్ర క్రైస్తవ ట్రినిటి సంఘం ఆధ్వర్యంలో ఏపీ ఎన్నార్టీ కో-ఆర్డినేటర్లు పొడిపిరెడ్డి వాసు, షేక్ ఖాదర్ బాషా, పాస్టర్ ఎలీషా భరించి, లబ్దిదారులకు ఉచితంగా బీమా పాలసీలు అందించారు. ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన రూ.10 లక్షల వరకు ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం కింద లభిస్తాయని వారు తెలిపారు.
దీంతోపాటు మృతదేహం లేదా వికలాంగుడిని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన విమాన టికెట్‌తో పాటు తోడుగా వెళ్లే మరో వ్యక్తికి కూడా విమాన టికెట్ కల్పిస్తారని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స నిమిత్తం రూ.లక్ష వరకు వైద్య సహాయం కింద చెల్లిస్తారని తెలిపారు. మరణించిన ప్రవాసాంధ్రుల కుటుంబ సభ్యుల చికిత్స నిమిత్తం ప్రతి సంవత్సరానికి రూ.50 వేలు చెల్లిస్తారని చెప్పారు. విదేశాల్లో ప్రవాసులు యాజమానితో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంటే న్యాయ సహాయం కింద రూ.45 వేల వరకు ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు.













