అమెరికాలో మూడు లక్షల కేసులు
ఇదీ కరోనా మహమ్మారి చేస్తున్న విలయం తాండవం. కోవిడ్-19 అమెరికాకు కంటీ మీద కనుకు లేకుండా చేస్తోంది. అక్కడ మొత్తం 3 లక్షల కేసులు నమోదయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలో 30 వేల కొత్త కేసులు నమోదైతే, అదే సమయంలో 1,500 మంది మరణించారు. ఈ పరిణామాలతో అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రజలందరూ బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సిఫారసు చేసింది. ఈ విషయాన్ని వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలందరూ సాధారణ మాస్కలే ధరించాలని చెప్పారు. తీవ్రంగా మాస్క్‌ల కొరత ఎదుర్కొంటున్న అమెరికా వైద్య సిబ్బందికి అవసరమయ్యే ఎన్95 మాస్క్‌లు పౌరులు వాడవద్దని సూచించారు. ఇంట్లో తయారు చేసుకునే మాస్క్ వేసుకోవాలన్నారు. అయితే తాను మాత్రం మాస్క్ వేసుకోనని ట్రంప్ వ్యాఖ్యానించడం విశేషం.
ఒక వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందదని చెప్పగా, అమెరికా శాస్త్రవేత్తలు కేసుల సంఖ్య పెరగడానికి గాలి ద్వారా వైరస్ సోకుతూందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని నిర్ధారించడానికి మరికొంత సమయం పడుతుందని సృష్టం చేశారు. అమెరికాలో కేసులు ఇంచుమించుగా 3 లక్షలకి దగ్గర్లో ఉంటే, మృతులు 7 వేలు దాటేశాయి.













