అమెరికాలో అత్యధిక కేసులు ఇక్కడే
అమెరికాలో కరోనాకు కేంద్ర బిందువుగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో ఈ వైరస్ అడ్డూ ఆదుపు లేకుండా ఊచకోత కోస్తోంది. ఈ మహమ్మారి కాటుకు బలవుతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 630 ప్రాణాలను ఈ వైరస్ హరించిందని గవర్నర్ ఆండ్రూ క్యూమో చెప్పారు. మరో వారం పాటు ఇక్కడ కొవిడ్-19 తాకిడి పెరుగుతూనే ఉంటుందని తెలిపారు. న్యూయార్క్ రాష్ట్రంలో ఏప్రిల్ 2-3 మధ్య రికార్డు స్థాయిలో 562 మంది కరోనాతో మరణించారు. ఆ తర్వాత గడిచిన 24 గంటల్లో ఈ మరణాల సంఖ్య 630కి చేరింది. దీంతో కొవిడ్-19తో ఇక్కడ బలైనవారి సంఖ్య 3,565కు చేరింది. దేశంలోనే అత్యధికంగా ఈ మహమ్మారి బారిన పడ్డ రాష్ట్రం ఇదే. దేశం మొత్తం మీద చోటుచేసుకున్న కేసుల్లో మూడో వంతు ఇక్కడే వెలుగు చూశాయి. ఆ తర్వాతి స్థానంలో న్యూజెర్సీ ఉంది.
రాష్ట్రంలో అత్యవసర వైద్య సాధనాలు, వైద్య నిపుణుల కొరత నెలకొనడంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కులు, గౌన్లు, ముఖకవచాలు లభించడంలేదన్నారు. 17 వేల వెంటిలేటర్ల కోసం ఆర్డరిచ్చామని తెలిపారు. అయినా సరిపడా సరఫరా లేదన్నారు. ఇలాంటి ఆర్డర్లు మొత్తం చైనాకే వెళుతున్నాయి. ఇలాంటి పరిస్థితి దారితీయడానికి కారణాలను శోధించాలి. దేశంలో వీటిని సరిపడా చేయలేని పరిస్థితి ఎందుకు నెలకొందో గుర్తించాల్సి ఉంది అని పేర్కొన్నారు.













