ఈ ఏడాది 10.2 శాతం వరకు జీతాల పెంపు.. హైదరాబాద్, వైజాగ్‌లలో బంపర్ ఆఫర్
దేశీయ కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తీపి కబురు మోసుకొచ్చింది. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారతీయ కంపెనీలు తమ సిబ్బందికి మెరుగైన వేతన పెంపు (Salary Hike) అందించేందుకు సిద్ధం అవుతున్నాయి. ప్రముఖ మానవ వనరుల సేవల సంస్థ ‘టీమ్‌లీజ్ సర్వీసెస్’ (TeamLease Services) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పరిశ్రమల్లో సగటున 8.6 శాతం నుంచి 10.2 శాతం వరకు జీతాల పెంపుదల ఉండే అవకాశం ఉంది.
ఈ రంగాల్లోనే అత్యధిక పెంపు..
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, వేగంగా వృద్ధి చెందుతున్న రంగాలు ఈసారి ఉద్యోగులకు భారీగా జీతాలు (Salary Hike) పెంచేందుకు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV), ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలు ఈ జాబితాలో ముందువరుసలో నిలిచాయి.
ప్రస్తుత జాబ్ మార్కెట్లో కేవలం కంపెనీలో ఉన్న అనుభవం కంటే.. అభ్యర్థికి ఉన్న ప్రత్యేక నైపుణ్యాలు, కంపెనీ వృద్ధిలో వారి ప్రతిభ, పనితీరు (Performance) మాత్రమే అత్యంత కీలకంగా మారాయని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ నిపుణులు, ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు వంటి ఉద్యోగాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వీరికి రెండంకెల స్థాయికి (10 శాతం కంటే ఎక్కువ) చేరువలో జీతాల పెంపులు (Salary Hike) లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మెట్రో నగరాలతో విశాఖపట్నం పోటీ
ఈ వేతన వృద్ధి కేవలం ముంబై, బెంగళూరు వంటి పెద్ద మెట్రో నగరాలకే పరిమితం కాకపోవడం గమనార్హం. దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలు కూడా ఈ రేసులో దూసుకుపోతున్నాయి. నగరాల వారీగా పరిశీలిస్తే..
చెన్నై: 9.7 శాతం పెంపుతో అగ్రస్థానంలో ఉంది.
హైదరాబాద్, పుణె: 9.6 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
విశాఖపట్నం, అహ్మదాబాద్: 9.5 శాతం జీతాల పెంపుతో ముందంజలో ఉన్నాయి.
ఉపాధి కేంద్రాలుగా టైర్-2 నగరాలు:
దేశంలో తయారీ రంగం (Manufacturing Sector) వేగంగా విస్తరించడం, భారీగా వస్తున్న కొత్త పెట్టుబడులు, పారిశ్రామిక కారిడార్ల (Industrial Corridors) అభివృద్ధి కారణంగా విశాఖపట్నం, నాగ్‌పూర్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలు కూడా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. మరోవైపు బ్యాంకింగ్, టెలికాం, నిర్మాణం (కన్స్ట్రక్షన్), రియల్ ఎస్టేట్ వంటి సాంప్రదాయ రంగాలలో జీతాల పెంపులు (Salary Hike) ఈసారి కొంత మితంగానే (సగటు స్థాయిలో) ఉండనున్నాయి. అయినప్పటికీ మొత్తం ఉద్యోగ మార్కెట్ ధోరణిని పరిశీలిస్తే.. టాలెంట్, నైపుణ్యం కలిగిన సిబ్బందికి డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గలేదని, కంపెనీలు ప్రతిభావంతులను నిలుపుకునేందుకు వేతనాలను పెంచేందుకే మొగ్గు చూపుతున్నాయని టీమ్‌లీజ్ నివేదిక చెప్తోంది.








