అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు షాక్.. ఫ్రీగా పాటలు వినే రోజులు పోయినట్లే!
భారతదేశంలో కోట్లాది మంది ఇష్టపడే ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తన ‘ప్రైమ్’ (Amazon Prime) చందాదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే చాలు.. ప్రైమ్ వీడియోతో పాటు ‘అమెజాన్ మ్యూజిక్’ (Amazon Music)లో ఎటువంటి ప్రకటనలు లేకుండా ప్రశాంతంగా, ఉచితంగా పాటలు వినే సదుపాయం ఉండేది. కానీ ఇకపై ఆ రోజులు పోయాయి. ప్రైమ్ కస్టమర్లకు కూడా పాటల మధ్యలో యాడ్స్ వినక తప్పదని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఒకవేళ పాటల మధ్యలో యాడ్స్ వద్దు అనుకుంటే మాత్రం కస్టమర్లు అదనంగా జేబుల నుంచి డబ్బులు చెల్లించాల్సిందే.
‘మ్యూజిక్ అన్లిమిటెడ్’ కొనాల్సిందే!
యాడ్స్ లేకుండా మునుపటిలాగే అంతరాయం లేకుండా పాటలు వినాలనుకునే యూజర్ల కోసం అమెజాన్ (Amazon Prime) కొత్తగా ‘అమెజాన్ మ్యూజిక్ అన్లిమిటెడ్’ (Amazon Music Unlimited) అనే ప్రీమియం ప్లాన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తీసుకుంటేనే ఎలాంటి ప్రకటనలు లేకుండా 100 మిలియన్లకు పైగా పాటలు, పాడ్‌కాస్ట్‌లను వినే వీలుంటుంది. అంతేకాకుండా హెచ్డీ, అల్ట్రా హెచ్డీ ఆడియోతో పాటు డాల్బీ అట్మోస్ (Dolby Atmos) సౌండ్ ఎఫెక్ట్, నచ్చిన పాటలను ఆఫ్‌లైన్‌లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం లభిస్తుంది.
ధరల విషయానికొస్తే.. ఇప్పటికే ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న యూజర్లు ఈ అన్లిమిటెడ్ సేవలను పొందాలంటే నెలకు రూ. 99 అదనంగా కట్టాలి. ఒకవేళ ప్రైమ్ (Amazon Prime) మెంబర్షిప్ లేని సాధారణ వినియోగదారులకైతే ఈ ప్లాన్ ధర నెలకు రూ. 119 గా ఉంటుంది. అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్రైమ్ సభ్యులకు 6 నెలలు, నాన్-ప్రైమ్ యూజర్లకు 3 నెలల పాటు ఉచిత ట్రయల్ (Free Trial) ఆఫర్‌ను కంపెనీ ఇస్తోంది.
మ్యూజిక్ ప్లాట్ ఫామ్‌లో కొత్త కేటగిరీలు
ఈ తాజా మార్పులతో అమెజాన్ (Amazon Prime) తన మ్యూజిక్ సేవలను మూడు విభాగాలుగా మార్చేసింది:
అమెజాన్ మ్యూజిక్ అన్లిమిటెడ్: ఇది పూర్తి స్థాయి ప్రీమియం ప్లాన్. డబ్బులు కడితే యాడ్స్ ఉండవు, ఆఫ్‌లైన్ డౌన్లోడ్స్, హై క్వాలిటీ ఆడియో వస్తాయి.
అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్: ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి ఇది వస్తుంది. ఇందులో పూర్తి పాటల కేటలాగ్ అందుబాటులో ఉన్నప్పటికీ, పాటల మధ్యలో యాడ్స్ రావడం ఖాయం. దీనితో పాటు అతిపెద్ద మైనస్ ఏంటంటే.. ఇకపై పాటలను ఆఫ్‌లైన్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఉండదు.
అమెజాన్ మ్యూజిక్ ఫ్రీ: దీనికోసం ఎలాంటి మెంబర్షిప్ ఫీజు కట్టాల్సిన పనిలేదు. ఎవరైనా ఉచితంగా పాటలు వినొచ్చు, కానీ ఇందులో పరిమితమైన ఫీచర్లు ఉండటంతో పాటు విపరీతంగా (Amazon Prime) యాడ్స్ వస్తాయి.
అసలు అమెజాన్ స్కెచ్ ఏంటి?
అమెజాన్ అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద మార్కెట్ వ్యూహమే ఉంది. ప్రస్తుతం మ్యూజిక్ స్ట్రీమింగ్ రంగంలో ఉన్న స్పాటిఫై (Spotify), యూట్యూబ్ మ్యూజిక్ (YouTube Music) వంటి అగ్రగామి సంస్థలు చాలా కాలంగా ఇదే ‘ఫ్రీ–యాడ్ సపోర్టెడ్–ప్రీమియం’ (Freemium) మోడల్‌ను నడుపుతూ భారీగా లాభాలు గడిస్తున్నాయి. పోటీ తట్టుకోవడంతో పాటు యాడ్స్ ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకే అమెజాన్ (Amazon Prime) సైతం ప్రైమ్ యూజర్లను వదలకుండా ఈ బాట పట్టిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా, ప్రైమ్ రీఛార్జ్ రేట్లు ఇప్పటికే భారం కాగా, ఇప్పుడు మ్యూజిక్ కోసం మళ్లీ అదనంగా డబ్బులు కట్టాల్సి రావడం సామాన్య వినియోగదారులకు మింగుడుపడని విషయమే.








