విశాఖలో సైకిల్‌పై సీఎం చంద్రబాబు.. పర్యావరణ పరిరక్షణకు ప్రజలకు ప్రత్యేక పిలుపు..
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day) సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 5వ తేదీన విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనకు వెళ్లనున్న ఆయన, అక్కడ సైకిల్ యాత్ర చేపట్టి పర్యావరణ హిత జీవనశైలి అవసరాన్ని ప్రజలకు తెలియజేయనున్నారు.
విశాఖ తీర ప్రాంతంలో జరిగే ఈ సైకిల్ సవారీ ద్వారా కాలుష్య నియంత్రణ, ఆరోగ్యకరమైన జీవన విధానం, పచ్చదన పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. సాధారణ రవాణా మార్గాలకు బదులుగా సైకిల్ వినియోగం పెరిగితే కార్బన్ ఉద్గారాలు తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆయన వివరించనున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సైకిళ్లు, ఈ-సైకిళ్లు (E-Bicycles) ఉపయోగిస్తూ పర్యావరణానికి మద్దతు ఇవ్వాలని, అదే సమయంలో ఒక్కొక్కరు కనీసం ఒక మొక్కను నాటాలని సూచించారు. తన విశాఖ పర్యటనలో ప్రజల్లో పర్యావరణ చైతన్యం పెంచడమే ప్రధాన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేకంగా సుస్థిర జీవన విధానం (Sustainable Living) గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నిర్వహించే జాతీయ స్థాయి వర్క్‌షాప్‌కు ముఖ్యమంత్రి నేరుగా సైకిల్‌పై చేరుకోనున్నారు. పర్యావరణ అనుకూల చర్యలను ప్రోత్సహించడంలో తాను ముందుండి ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సైకిల్ వినియోగం వల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని ఆయన చెబుతున్నారు.
సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సందేశంలో చంద్రబాబు, భూమిని మన ఇల్లుగా భావించి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రకృతి వనరులు మన జీవనానికి ఆధారం కావడంతో వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. గాలి, నీరు, నేల కాలుష్యాన్ని తగ్గించేందుకు సమాజం మొత్తం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పచ్చదనాన్ని పెంపొందించడం, సహజ వనరులను కాపాడుకోవడం, ఇంధనాన్ని పొదుపుగా వినియోగించడం ద్వారా మెరుగైన భవిష్యత్తును నిర్మించవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి ప్రకృతి సంరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని చంద్రబాబు కోరారు.








