ప్లేఆఫ్స్ రేసులో కీలకం, ఢిల్లీ వర్సెస్ చెన్నై
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ విజయం అత్యంత కీలకం. ప్రస్తుత పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు తలా 8 పాయింట్లతో వరుసగా 6 (CSK), 7 (DC) స్థానాల్లో ఉన్నాయి. మెరుగైన రన్ రేట్ (+0.005) కారణంగా చెన్నై కాస్త ముందుండగా, ఢిల్లీ (-0.895) రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవాల్సిన ఒత్తిడిలో ఉంది.
చారిత్రాత్మక గణాంకాలను పరిశీలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ కు ఢిల్లీపై మంచి రికార్డ్ ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 32 సార్లు తలపడగా, చెన్నై 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది, ఢిల్లీ కేవలం 12 సార్లు మాత్రమే గెలిచింది. ముఖ్యంగా ఢిల్లీ హోమ్ గ్రౌండ్ అయిన కోట్లా స్టేడియంలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 సార్లు చెన్నైయే విజయం సాధించడం గమనార్హం. ఈ సీజన్లో ఏప్రిల్ 11న జరిగిన మొదటి పోరులో కూడా సంజూ శామ్సన్ సెంచరీ (115*) పుణ్యమా అని చెన్నై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
నేటి మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సిఎస్కే అభిమానులకు ఒక నిరాశపరిచే వార్త ఏమిటంటే, గాయం కారణంగా ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఆటగాళ్ల ఫామ్ విషయానికి వస్తే, ఢిల్లీ స్టార్ట్ ఆటగాడు కేఎల్ రాహుల్ (433 పరుగులు) భీకరమైన ఫామ్‌లో ఉండగా, చెన్నై బౌలింగ్ విభాగంలో అన్షుల్ కాంబోజ్ (17 వికెట్లు) ప్రత్యర్థులకు సవాలు విసురుతున్నాడు. సొంత గడ్డపై ఢిల్లీ ప్రతీకారం తీర్చుకుంటుందో లేక చెన్నై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి








