వీణా బృందనాదంతో మార్మోగిన అన్నమయ్యపురంవీణా బృందనాదంతో మార్మోగిన అన్నమయ్యపురం
అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్నం భక్తులకు 200 మందికి పైగా అన్నదాన ప్రసాద వితరణ జరిగింది.
అనంతరం సాయంత్రం యథావిధిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అన్నమయ్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి (గురు స్తుతి)తో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.
అనంతరం “శ్రీ శక్తి సేవా సత్సంగ్ వీణా బృందనాదం” ఆధ్వర్యంలో ప్రముఖ వీణా గురువు శ్రీమతి ఉన్నవ కళ్యాణి హేమలత గారి మార్గదర్శకత్వంలో, సమన్వయకర్త పి. మీనాక్షి శ్రీనివాస్ గారి నిర్వహణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన వారి శిష్యులు “కల్పన, మాధవి, లలిత, శ్రీ లక్ష్మీ, రేణుకా దేవి, అనురాధ, రాణి, సత్యవాణి, శ్రీదేవి, అన్నపూర్ణ, శివ జ్యోతి, శ్రీ వల్లీ, వేదవతి, శ్రీవిద్య” తదితరులు, సుమారుగా 95 మంది వీణా వాద్య కళాకారులు ఒకే వేదికపై సంయుక్తంగా అన్నమాచార్య సంకీర్తనలను వీణా నాదంతో ఆలపించి అపూర్వమైన సంగీతానుభూతిని కలిగించారు.
ఇందులో భాగంగా “గం గం గం గణపతి వందనం, ఆదివో అల్లదివో, తిరు తిరు జవారాల, తందనానా, వేడుకొందామా, చూడరమ్మ సతులాల, రామ రామ రామ్ రామ్ రామ్, క్షీరాబ్ధి కన్యకకు, చక్కని తల్లికి, మలై మట్రినల్, గోవింద కృష్ణ జై, గరుడ గమన, జగడపు చనువుల, గోవింద నామాలు, రామచంద్రాయ” వంటి సంకీర్తనలను వీణా బృందనాదంగా సమర్పించి విచ్చేసిన భక్తులను భక్తిరసంలో ముంచెత్తారు.
ఈ కార్యక్రమానికి పి.వి.ఎన్.ఎస్.హెచ్. వరప్రసాద్ మృదంగంపై, రామకృష్ణ గుండా తబలాపై, కప్పగంతు అనీష్ ప్యాడ్స్పై వాయిద్య సహకారం అందించి వీణా నాదానికి మరింత మాధుర్యాన్ని చేకూర్చారు.

ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు గారు ఒక అన్నమాచార్య సంకీర్తనకు భావార్థ వివరణ ఇచ్చి, ఒకే వేదికపై ఇంతమంది వీణా కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను సమిష్టిగా సమర్పించడం విశిష్టమైన సంగీత యజ్ఞమని కొనియాడారు.
తదనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు గురువులు, సమన్వయకర్తలు, వాద్య కళాకారులను శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలతో సత్కరించారు.
కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో ఈ కార్యక్రమం భక్తి, సంగీత వైభవంతో విజయవంతంగా ముగిసింది.








