“వస్తావా? రేటెంత?”.. అర్ధరాత్రి ఐపీఎస్ ఆఫీసర్ సాహసం!
చీకటి పడితే చాలు.. నగర వీధుల్లో రాక్షసులు నిద్రలేస్తారు. చదువుకున్న వాళ్లమని చెప్పుకునే కొందరు సంస్కారహీనులు, విలాసాల కోసం తిరిగే వికృత మనస్తత్వాలు ఒంటరి మహిళ కనిపిస్తే చాలు వేట మొదలుపెడతాయి. కానీ, ఆ రాత్రి వారు వేటాడాలనుకుంది ఒక సాధారణ మహిళను కాదు.. అన్యాయాన్ని చీల్చి చెండాడే ఒక ఐపీఎస్ అధికారిణిని! మల్కాజ్గిరి డీసీపీ సుమతి చేపట్టిన ఈ ‘స్పెషల్ ఆపరేషన్’ ఇప్పుడు సంచలనంగా మారింది.
మహిళల భద్రత గురించి ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని డీసీపీ సుమతి నిర్ణయించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల సమయంలో, ఆమె ఎటువంటి భద్రతా హంగామా లేకుండా, ఒక సాధారణ మహిళలా దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపైకి వచ్చారు. ఖాకీ యూనిఫాం లేదు, గన్మెన్లు లేరు.. కేవలం సామాన్య పౌరురాలిగా ఆమె అక్కడ నిలబడ్డారు. కొద్ది దూరంలో మఫ్టీలో ఉన్న పోలీసు బృందం ఆమెను గమనిస్తూ ఉంది.
ఇవి కూడా చదవండి
ఆమె రోడ్డుపై నిలబడిన కొద్దిసేపటికే అసలు రంగు బయటపడింది. అర్ధరాత్రి వేళ ఒక మహిళ ఒంటరిగా ఉంటే సహాయం చేయాలనే ఆలోచన ఎవరికీ రాలేదు. పైగా ఆమె చుట్టూ పోకిరీలు చేరడం మొదలుపెట్టారు. బైకులపై వెళ్తూ అసభ్యకరంగా సైగలు చేయడం, వెకిలి నవ్వులు నవ్వడం మొదలైంది. ఒక అడుగు ముందుకేసి.. “వస్తావా? రేటెంత?” అంటూ నేరుగా ఆ ఐపీఎస్ అధికారిణినే ప్రశ్నించారు. సమాజంలో మృగాళ్ల తెగింపు ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఈ ఒక్క ప్రశ్నే నిదర్శనం.
అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది. డీసీపీని వేధించిన ప్రతి ఒక్కరిని మఫ్టీలో ఉన్న పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
సాధారణంగా ఇలాంటి పనులు చేసేవారు ఆకతాయిలు లేదా నిరక్షరాస్యులు అని మనం అనుకుంటాం. కానీ ఈ ఆపరేషన్‌లో పట్టుబడ్డ వారు సమాజంలో గౌరవప్రదమైన హోదాల్లో ఉన్నవారు. ఉన్నత చదువులు చదువుతున్న యువకులు, సాఫ్ట్వేర్ సంస్థల్లో, ఇతర కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్లే వీళ్లంతా. వీరిలో చాలామంది గంజాయి సేవించి మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చేతిలో ఐఫోన్లు, ఖరీదైన బైకులు ఉన్నా.. సంస్కారం మాత్రం శూన్యమని ఈ ఘటన నిరూపించింది.
పట్టుబడ్డ 40 మందికి పోలీసులు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. చదువుకున్న వారు ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటం వల్ల వారి భవిష్యత్తు ఎలా నాశనమవుతుందో వివరించారు. కేవలం కౌన్సిలింగ్‌తో వదిలేయకుండా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు కేవలం డిగ్రీలు ఇప్పించడం కాదు, ఆడవారిని గౌరవించే సంస్కారాన్ని కూడా నేర్పాలని డీసీపీ సుమతి ఈ ఆపరేషన్ ద్వారా సందేశాన్ని ఇచ్చారు. మహిళల భద్రత కోసం పోలీసులు ఎంతటి సాహసానికైనా సిద్ధమని నిరూపించిన డీసీపీ సుమతికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి








