మంత్రి కేటీఆర్ కు డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) నుంచి మళ్లీ ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 25వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ఈ సమావేశాల్లో ప్రత్యేక అతిథిగా ప్రసంగించాలని కేటీఆర్‌ను డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బెర్గ్ బ్రెండ్ కోరారు. 49వ డబ్ల్యూఈఎఫ్ గ్లోబలైజేషన్ 4.0 షేపింగ్ గ్లోబల్ ఆర్కిటెక్చర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రీయల్ రివల్యూషన్ అనే థీమ్‌తో నిర్వహించే ఈ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం నాలుగేళ్లలో టెక్నాలజీ అంత్రపెన్యూర్షిప్, ఇన్నోవేషన్ వంటి అంశాలను బాగా ఉపయోగించుకున్నారని పేర్కొంది. కేటీఆర్ తన ప్రసంగంలో పట్టణాభివృద్ధి, డిజిటలైజేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఉద్యోగాల కల్పన, పాలనలో పారదర్శకత వంటీ కీలక అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, ప్రభుత్వ ఎజెండా ప్రాధాన్యతలను వివరించాలని బెర్గ్ బ్రెండ్ కోరారు. డబ్ల్యూఈఎఫ్ సమావేశాలకు ఆహ్వానంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.













